Jubilee Hills By Election
Jubilee Hills By Election : కారు రావాలో.. బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) ప్రచారంలో భాగంగా సోమవారం కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయం పక్కా.. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, మెజార్టీ ఎంత అనేది మాత్రమే తేలాలి అని కేటీఆర్ మాగంటి సునీత గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. 25ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్నో ఎన్నికలు చూసింది.. జూబ్లీహిల్స్ పోరు షురూ అయింది. నీతి, నిజాయితీ, ప్రజలు మనవైపు ఉన్నారు. కాంగ్రెస్ మాటలకు మోసపోయిన వారు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు రెడీగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజల దగ్గరకు బీఆర్ఎస్ పోతుంది. పింఛన్ పెంచలేదు, ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ప్రతిఒక్కరికి ఎంత బాకీ ఉందో బాకీ కార్డు ద్వారా చెబుతున్నాం. రంజాన్ తోఫా రాలేదు. బతుకమ్మ చీర రాలేదు. ముఖ్యంగా మీ ఇంటికి కారు రావాలో.. బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ సూచించారు.
రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు చూస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెబితే.. ఆరు హామీలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు అంతా జూబ్లీహిల్స్ ఎన్నికలవైపు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క ఇల్లు కట్టలేదు. కానీ, హైడ్రా పేరుతో ఎన్నోఇళ్లు కూల్చివేశారని కేటీఆర్ విమర్శించారు. అజారుద్దీన్‌ను రేవంత్ రెడ్డి బకరా చేశాడు. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు.. అది చెల్లదు. అజారుద్దీన్ ను రేవంత్ రెడ్డి ఆగం చేసిండు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అందుకే హైదరాబాద్ ప్రజలపై పగబట్టి హైడ్రా అని ఇళ్లు కూల్చుతున్నారు. నల్లా బిల్లులు వసూళ్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో వేలాది దొంగ ఓట్లు నమోదు చేశారు. ఒక్క ఇంట్లోనే 43 ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లపై స్టడీ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.