Jubilee Hills By Election
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో కీలక ఘట్టానికి అడుగు పడింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టి నుంచి ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
22వ తేదీన నామినేషన్ల పరిశీలన.. 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు అవకాశం ఉంటుంది.
ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరుగుతుంది.
నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.
నవంబర్ 16వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తిస్థాయిలో ముగియనుంది.
ఇవాళ్టి నుంచి షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.
ఈ ఉపపోరుకు సంబంధించి ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా.. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. బీజేపీ అధిష్టానం ఇంకా అభ్యర్థిని ఫైనల్ చెయ్యలేదు. ఇవాళ, రేపు బీజేపీ అధిష్టానం అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలాఉంటే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడా డివిజన్ కృష్ణానగర్ బి- బ్లాక్ బూత్ నెంబర్ 246 ఓటర్ జాబితా గందరగోళంపై హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ సీరియస్ అయ్యారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించారు. ఒకే ఇంటి నెంబర్ పై 43ఓట్లు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఫోకస్ పెట్టారు. రిపోర్టు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధణల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.