Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిశాక కూడా ప్రచారంలో పాల్గొంటే కేసులు పెడతామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అన్నారు. ఎన్నికల సంఘం ఏర్పాట్లపై ఆయన మీడియాకు వివరాలు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు ఉంటాయని చెప్పారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం నిషేధమని కర్ణన్ అన్నారు. బల్క్ మెసేజులు కూడా పంపించకూడదని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా ఉంటుందని అన్నారు.
ఉప ఎన్నికలో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని తెలిపారు. రేపు కోట్ల విజయ్‌భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామని చెప్పారు. జూబ్లిహిల్స్ నియోజక వర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ఈ సారి డ్రోన్లతో నిఘా ఉంటుందని చెప్పారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని తెలిపారు.
“ఉప ఎన్నిక బరిలో 58 మంది ఉన్నారు. DRC సెంటర్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉంటుంది. అక్కడ మూడు అంచెల భద్రత ఉంటుంది. 226 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి” అని అన్నారు.