Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ల దాఖలు పూర్తి చేశారు. ఇప్పటివరకు 180 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు 3గంటల లోపు ఆర్వో ఆఫీస్ గేట్ లోపల ఉన్నవారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించారు అధికారులు. 3 గంటల లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు ఎలక్షన్ అధికారులు. ఈరోజు మొత్తం 188 టోకెన్లు జారీ చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి.
ఇప్పటివరకు 64 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, అర్ధరాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది.
ఈసారి జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు బరిలో దిగడం ఆసక్తికరంగా మారింది. ఇంకా నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పలువురు ఓయూ విద్యార్థులు సైతం బరిలో నిలిచారు. ఇక రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. నామినేషన్ల విత్ డ్రాకు తుది గడువు 24. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి.
18వ తేదీ వరకు 94 మంది నామినేషన్ల దాఖలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా నామినేషన్లు రావడం ఆసక్తికరంగా మారింది. ట్రిపుల్ ఆర్ కు సంబంధించి.. అన్యాయంగా అలైన్ మెంట్ మార్చడం ద్వారా తమకు నష్టం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తూ బాధిత రైతులు నామినేషన్లు వేశారు. అటు మాకు సంబంధించిన బెనిఫిట్స్ రాలేదంటూ రిటైర్డ్ ఉద్యోగులు కొందరు నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారిలో ఎక్కువగా ఇండిపెండెంట్లు ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఇక్కడ గెలిచి తీరాలనే కసితో అధికార కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. గోపీనాథ్ భార్య సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించింది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఓట్లను కురిపిస్తాయనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ బీసీలకు టిక్కెట్ కేటాయించింది. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్.. గెలుపుపై ధీమాగా ఉన్నాయి. తాము కూడా సత్తా చాటుతామని బీజేపీ అంటోంది. 2023 ఎన్నికల్లో దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.