×
Ad

Telangana BJP : జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ పోవడమే కాదు.. ఇంకో దారుణ పరాభవం

Jubilee Hills Bypoll Results జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.

Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 1/6 వస్తే డిపాజిట్ వస్తుంది. అంటే ఏ పార్టీ అభ్యర్థికైనా డిపాజిట్లు రావాలంటే 32,439 ఓట్లు రావాలి. కానీ, బీజేపీ అభ్యర్థికి 20వేల ఓట్లు కూడా రాలేదు. 17,061ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉపపోరులో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. అయితే, ఇక్కడ బీజేపీ శ్రేణులను ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే.. బీజేపీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ కు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. దీంతో నవీన్ యాదవ్ 24, 729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అయితే, నవీన్ యాదవ్ కు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థికి రాకపోవటం ఆ పార్టీ శ్రేణులను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలోనూ రోజురోజుకు బలమైన ప్రతిపక్ష పార్టీగా ఎదుగుతోంది. ఈ సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం.. గెలిచిన అభ్యర్థి మెజార్టీ కంటే బీజేపీ అభ్యర్థికి ఓట్లు తక్కువ రావడం బీజేపీ శ్రేణులను ఒకింత ఆవేదనకు గురిచేస్తోంది.