Muhammad Anwar
Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యం రౌండ్ రౌండ్‌కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో చనిపోయిన వ్యక్తికీ ఓట్లు పోలయ్యాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అన్వర్ పోటీ చేశారు. అయితే, ఇవాళ (శుక్రవారం) ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. మహమ్మద్ అన్వర్ ఎర్రగడ్డలో నివాసి. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశాడు. ఓట్ల లెక్కింపు రోజే ఆయన కన్నుమూశారు.
మహ్మద్ అన్వర్ కు మొత్తం 24 ఓట్లు పోలయ్యాయి. ఫస్ట్ రౌండ్ లో మూడు ఓట్లు రాగా.. రెండో రౌండ్ లో ఐదు ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్ లో రెండు ఓట్లు, నాలుగో రౌండ్ లో రెండు ఓట్లు, ఐదో రౌండ్ లో నాలుగు ఓట్లు, ఆరో రౌండ్ లో ఒక ఓటు పోలైంది. ఎనిమిదో రౌండ్ లో రెండు ఓట్లు, తొమ్మిదో రౌండ్ లో రెండు ఓట్లు, పదో రౌండ్ లో రెండు ఓట్లు పోలయ్యాయి.