Jubilee Hills constituency by-election
Jubilee Hills by-election : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు నగరా మోగింది. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుందని, నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని కేంద్ర ఎన్నిలక ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్..
♦ నోటిఫికేషన్ – అక్టోబర్ 13
♦ నామినేషన్ లాస్ట్ డేట్ – అక్టోబర్ 21
♦ నామినేషన్ స్క్రూట్నీ – అక్టోబర్ 22
♦ నామినేషన్ విత్ డ్రా లాస్ట్ డేట్ – అక్టోబర్ 24
♦ పోలింగ్ – నవంబర్ 11
♦ కౌంటింగ్ – నవంబర్ 14
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుండగా.. జూబ్లీహిల్స్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సత్తాచాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ప్రకటించింది. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థిత్వ రేసులో ఉన్నారు. వారిలో ఒకరి పేరును అభ్యర్థిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. ఆ నలుగురి పేర్లను ఇప్పటికే ఇన్‌చార్జి మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం. నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లో గెలిచే ఛాన్స్ ఉన్న నేతల పేర్లను ప్రతిపాదించాలని ఈ విషయంలో ఇన్‌చార్జులుగా ఉన్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దీంతో ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో వచ్చే రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని పేరును ప్రకటించనుంది.
బీజేపీ అధిష్టానం జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేతల బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేలా చర్చలు జరుపుతున్నారు. బీజేపీ నుంచి ప్రధానంగా దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి.