Site icon 10TV Telugu

Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

MLA Maganti Gopinath passes away: బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్.. ఆదివారం తెల్లవారు జామున 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడించారు.

 

మాగంటి గోపీనాథ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈనెల 5వ తేదీన ఆయన నివాసంలో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు చికిత్స అందించారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలో వెంటిలేటర్ పై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి గోపీనాథ్ ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కాగా.. కొన్నాళ్లుగా గోపీనాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.

 

మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి బరిలో నిలిచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గోపీనాథ్ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు. వరుసగా మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ నియోజకవర్గం అభివృద్ధి విశేష కృషి చేశారు.

Exit mobile version