Junior Panchayat Secretaries(Photo : Google)
Junior Panchayat Secretaries Strike : తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దౌత్యం ఫలించింది. పంచాతీయ కార్యదర్శులతో ఆయన జరిపిన చర్చలు ఫలితాన్ని ఇచ్చాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు.
తాము సమ్మె విరమిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు JPS (జూనియర్ పంచాయతీ కార్యదర్శులు) లు లేఖ ఇచ్చారు. తొర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు జూ.పంచాయతీ కార్యదర్శులు ప్రకటించారు. కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 16 రోజులు పాటు సమ్మె చేశారు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లుగా జేపీఎస్ లు ప్రకటన చేశారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ జూ.పంచాయతీ కార్యదర్శులు 16 రోజుల పాటు సమ్మె చేశారు.
తొర్రూర్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో జేపీఎస్ కు సంబంధించిన రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేపీఎస్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. 16 రోజుల పాటు బెట్టు వీడకుండా సమ్మె చేసిన జేపీఎస్ లపై ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం, సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని జేపీఎస్ లను కోరింది. అయితే, అందుకు జేపీఎస్ లు ఒప్పుకోలేదు. దీనిపై మరోసారి సీరియస్ అయిన ప్రభుత్వం కచ్చితంగా విధుల్లో చేరాల్సిందేనని జేపీఎస్ లకు అల్టిమేటమ్ జారీ చేసింది.
అంతేకాదు, సమ్మె చేస్తున్న వారిని విధుల నుంచి తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సమస్యకు ఒక పరిష్కారం చూపే విధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా స్వయంగా రంగంలోకి దిగారు. జేపీఎస్ లతో చర్చలు జరిపారు.
ప్రభుత్వం మీద నమ్మకం ఉంచాలని, కచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు న్యాయం చేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక భరోసా ఇచ్చారు. దాంతో, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వెనక్కితగ్గారు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి యధావిధిగా విధుల్లో చేరుతున్నట్లు చెప్పారు.