పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు తీర్పు.. కూనంనేని ఇలా, కడియం అలా..

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు చాలా మంచిదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనగా.. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

kadiyam srihari: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశిస్తూ సోమవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఐ పార్టీ హైకోర్టు తీర్పును స్వాగతించాయి. హైకోర్టు తీర్పు చాలా మంచిదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొనగా.. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని
హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ”పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే సంతోషించే వాళ్లం. మేమే పార్టీ మారితే వెంటనే ఆటో మేటిక్‌గా అనర్హత వేటు పడాలి. పార్టీ మారిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాల”ని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : పార్టీ మారిన ప్రజా ద్రోహులు తమ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం: జగదీశ్ రెడ్డి

వ్యక్తిగతంగా పోరాటం చేస్తా: కడియం శ్రీహరి
పార్టీ ఫిరాయింపులపై కోర్టులు భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయంటూ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ”కోర్టుల భిన్నమైన తీర్పులపై అధ్యయనం జరగాలి. ఇలాంటి తీర్పులపై రాజ్యాంగ ధర్మాసనం వద్ద చర్చ జరగాలి. ఒక అంశంపై సుప్రీంకోర్టే రెండు భిన్నమైన తీర్పులు ఇస్తోంది. ఫైవ్ జడ్జెస్ ధర్మాసనం ఒక రకంగా, త్రీ జడ్జెస్ బెంచ్ మరో రకంగా స్పందిస్తోంది. ఈనాటి ఫిరాయింపుల అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక రకంగా, సింగిల్ జడ్జ్ బెంచ్ మరోరకంగా స్పందించింది. నా విషయంలో కోర్టు తీర్పుపై నేను వ్యక్తిగతంగా పోరాటం చేస్తాను. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటాను. హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తాను. రాజకీయాలను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించింది. ఫిరాయింపులను ప్రోత్సహించింది. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు ఏమనుకుంటారోననే ఇంగిత జ్ఞానం కూడా లేద”ని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు