Kaleshwaram Commission final report
Kaleshwaram Commission Report: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధికారుల కమిటీ అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి, కీలక అంశాలను నివేదికలో కమిషన్ పేర్కొంది. 10 పేజీల్లో హైలెవల్ కమిషన్ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించనున్నారు. అయితే, ఈ నివేదికలో కమిషన్ కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రాజెక్టులో విధాన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్ పేర్కొంది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే ప్రాజెక్టుకు ఆమోదం జరిగిందని, సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారని పేర్కొన్న కమిషన్.. ఎవరెవరు బాధ్యులో పేర్లనుసైతం కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మాణం జరిగిందని, ప్రాజెక్టు నిర్మాణంలో థర్డ్ పార్ట్ జోక్యం ఎక్కువైందని తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కమిషన్ పేర్కొంది. డిజైన్, లొకేషన్ మార్పులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
తుమ్మిడిహెట్టిలో నీటి లభ్యతలేదని సమర్థించుకొని, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారు. ఇందులో నిజాయితీ, చిత్తశుద్ది చూపలేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ అంతా కేసీఆర్ దే నిర్ణయం అని, ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం ఉందని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం డిజైను పూర్తిస్థాయిలో స్టడీ చేయలేదు. కాళేశ్వరం అంచనాలను, డీపీఆర్‌లను కూడా క్యాబినెట్ ముందు పెట్టలేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కమిషన్ఈ 10 పేజీల నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. కీలక అంశాలను సీఎంతో ఉత్తమ్ చర్చించనున్నారు.
కాగా.. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రులు చర్చించనున్నారు. అయితే, రిపోర్టుపై క్యాబినెట్ ఏం చేయనుంది..? సంచలన నిర్ణయాలు ఉంటాయా..? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.