Kalvakuntla Kavitha
Kavitha : అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఏ ఆశయాలకోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలి. పేగులు తెగేదాక కోట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 అమరులయ్యారని అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ, అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామని కవిత పేర్కొన్నారు.
580 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాం.. ఉద్యమకారులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు, కొన్ని చోట్ల ఎంపీపీ, జెడ్పిటిసి టిక్కెట్లు వచ్చాయి. కానీ, ఉద్యమకారులకు అనుకున్న మేర న్యాయం జరగలేదని కవిత అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నేను మంత్రిగా లేకపోయినా ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని అడిగాను.
అయితే, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కొట్లాడలేక పోయినందుకు అమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా.. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నానని కవిత అన్నారు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా.. ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తానని కవిత అన్నారు. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో ‘జనం బాట’ పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా.. మీరు కూడా నాతో కలిసి రండి.. అందరం కలిసి పోరాటం చేద్దామని కవిత పిలుపునిచ్చారు.