Karimnagar constituency: కరీంనగర్ లో కాంగ్రెస్ పూర్వవైభవం సాధిస్తుందా.. గంగుల ప్రత్యర్థి ఎవరు.. బండి మళ్లీ అసెంబ్లీకి పోటీచేస్తారా?

దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.

Karimnagar Assembly constituency : ఖతర్నాక్ పాలిటిక్స్ కు కేరాఫ్ కరీంనగర్. రాజకీయ ఉద్దండులెందరో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉద్దండులు పోటీచేస్తారా? కొత్త ముఖాలతో సరికొత్త రాజకీయం ఆవిష్కృతం కానుందా అన్న ఆసక్తి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సొంత పార్టీలో అసమ్మతికి చెక్ పెట్టుకుంటూ వచ్చిన గంగుల కమలాకర్ ఈ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి ఎవరో ఇంతవరకు స్పష్టత రాలేదు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ తరఫున అసెంబ్లీ బరిలో దిగిన బండి సంజయ్ (Bandi Sanjay)… 2019లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై బిజీ అయ్యారు. ఇప్పుడు బండి మళ్లీ అసెంబ్లీకి పోటీచేస్తారా? లేక ఎంపీగానే బరిలో ఉంటారా? అనేది స్పష్టం కావడంలేదు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన చలిమెడ లక్ష్మీనర్సింహరావు (chalimeda laxmi narasimha rao) కారెక్కేయడం.. 2018లో బరిలో దిగిన పొన్నం ప్రభాకర్ లోక్ సభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఎవరో తెలియకుండానే కదనరంగంలోకి దూకి ఓ అడుగు ముందుకు వేశారు గంగుల.

కరీంనగర్ శాసనసభా నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009 కంటే ముందు ఈ నియెజకవర్గం వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉండేది. కరీంనగర్ ఎమ్మెల్యే అయినా.. ఎంపీ అయినా ఆ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చేవారు. 2009 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వెలమ కోటకు బీటలు పెట్టి… హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు గంగుల కమలాకర్. తొలిసారి టిడిపి తరఫున ఇక్కడి నుండి జెండా ఎగురవేసిన గంగుల కమలాకర్.. ఆ తర్వాత కారెక్కేసి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. రాజకీయ ఉద్దండులుగా పేరున్న ఎం. సత్యనారాయణరావు, జువ్వాడి చోక్కారావు, చలిమెడ ఆనందరావు, వెలిచాల జగపతిరావు లాంటి వారు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం లో ఇఫ్పుడు గంగుల కమలాకర్ పాగా వేశారు. అసెంబ్లీ పరిధిలో కరీంనగర్ సిటితో పాటుగా, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. 3 లక్షల 21 వేల 758 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు లక్షా 61 వేల 765 కాగా… మహిళా ఓటర్లు లక్షా 59 వేల 970. నియోజకవర్గంలో అత్యధికంగా 45 వేల ముస్లిం మైనార్టీ, మరో 8 వేల క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీరే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. ఆ తరువాత అత్యధికంగా 34 వేల మున్నరు కాపు, 28 వేల పద్మశాలి, 21 వేల ముదిరాజ్ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్యేగా గంగుల విజయంలో మైనార్టీ, మున్నూరు కాపు ఓటర్లదే ప్రధాన పాత్రగా చెప్తుంటారు. దీంతో రానున్న ఎన్నికల్లోనూ ఈ సామాజికవర్గ ఓటర్లు ఎటు వైపు నిలిస్తే వారే విజయం సాధించే అవకాశం ఎక్కువ.

గంగుల కమలాకర్ (Photo: Instagram)

నాలుగోసారి విజయంపై గంగుల దీమా
కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ పోటీచేయడం దాదాపు ఖాయం. ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించిన గంగుల కమలాకర్.. మరో విజయంపై కన్నేసారు. 2009లో టీడీపీ తరపున మొదటి సారి పోటి చేసి గెలిచిన గంగుల.. తెలంగాణ అవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటి చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్లోనూ స్థానం దక్కించుకున్నారు. గతంలో మాజీ మేయర్ రవిందర్ సింగ్ తో గంగులకు విభేదాలు ఉండగా.. ఆయనకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టి.. మంత్రికి రూట్ క్లియర్ చేసింది బిఆర్ఎస్ అధిష్టానం. అయితే బోమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. గంగులపై పోటీకి రెడీ అంటున్నారు. ఏ పార్టీ టిక్కెట్ ఇచ్చినా సరే అంటూ పోటీకి తహతహలాడుతున్నారు. గంగుల మాత్రం కరీంనగర్ అభివృద్ధి, బలమైన తన వర్గం ఓటు బ్యాంకుతో నాలుగోసారి విజయం ఖాయమనే ధీమా ప్రదర్శిస్తున్నారు.

బండి సంజయ్ (Photo: Twitter)

బిజేపీ అభ్యర్థిపై సస్పెన్స్
డబుల్ ఇంజిన్ సర్కార్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నా బిజెపి నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటి చేస్తారనేది స్పష్టత లేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో గంగుల కమలాకర్ కు గట్టి పోటినిచ్చారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఎంఐఎం సహకారంతో మైనారిటీ ఓట్లతో కమలాకర్ విజయం సాధించారు. ఆ తరువాత బండి సంజయ్ ఎంపీగా పోటి చేసి గెలుపొందడం… రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో సంజయ్ ఇమేజ్ పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడంతో సంజయ్ మళ్లీ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేదా అనే విషయంపై క్లారిటి లేకుండా పోయింది. బిజెపిలో బండి సంజయ్ తప్పించి మరో గట్టి లీడర్ కనిపించడం లేదు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక బండి సంజయ్ మరోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతుంది.

జయపాల్ రెడ్డి (Photo: Facebook)

సంజయ్ కరీంనగర్ నుంచి కాకుండా వేములవాడ లేదా హుస్సాబాద్ నియెజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా కమలదళంలో జోరుగా సాగుతోంది. అదే జరిగితే కరీంనగర్ బరిలో బిజేపీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ బండి సంజయ్ పోటీ చేయకపోతే.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎంఎస్ఓ కొత్త జయపాల్ రెడ్డి (Kotha Jaipal Reddy) బిజెపి టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని… రానున్న ఎన్నికల్లో ఎవరు బరిలో దిగినా గెలిచేది బిజేపీయేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్.

Also Read: ఆర్మూరులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఉనికి కోసం కాంగ్రెస్ పాకులాట..

రోహిత్ రావు (Photo: Facebook)

రోహిత్ అభ్యర్థిత్వానికే పొన్నం మద్దతు
కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు జోష్ నింపాయి. వరుస ఓటములతో జిల్లాలో కాంగ్రెస్ డీలా పడిపోవడంతో క్యాడర్ చెల్లచెదురైంది. గత ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈ సారి పార్లమెంట్ బరిలో నిలుస్తానంటున్నారు. దీంతో ఆశావాహులకు టిక్కెట్పై ఆశలు పెరుగుతున్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎమ్మెస్నార్ మనువడు, ఎన్ఆర్ఐ రోహిత్ రావు (Meneni Rohith Rao) పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రోహిత్రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుస్తున్నారు. కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్ సైతం టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా టిక్కెట్ తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారంలోకి దిగిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో పొన్నం తరువాత అంత చరిష్మా కలిగిన లీడర్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కనిపించడం లేదు. గతంలో పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితానికి ఎమ్మెస్సార్ అండగా ఉంటే… ఇప్పుడు ఆయన మనువడు రోహిత్ కు పొన్నం ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను అసెంబ్లీ బరిలో దిగకపోతే.. రోహిత్ అభ్యర్థిత్వానికే పొన్నం మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ కంచుకోట కరీంనగర్ లో తిరిగి పూర్వవైభవం సాధించి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Also Read: ఇందూరు రాజకీయం ఎలా ఉండబోతోంది.. గుప్త హ్యాట్రిక్ కొడతారా?

దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ (Velama) సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. జిల్లాలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలిచే మొదటి సీటు సిరిసిల్ల అయితే.. రెండో సీటు కరీంనగర్ అంటుంటారు గులాబీ సైనికులు. అటు కాంగ్రెస్, బీజేపీలు సైతం రానున్న ఎన్నికల్లో గెలిచే సీట్ల లిస్టులో కరీంనగర్‌ను చేర్చుకున్నాయి. ఇలా ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.

ట్రెండింగ్ వార్తలు