Kavita (Image Credit To Original Source)
Kavita: కారు దిగారు. ఎట్టకేలకు తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను కూడా ఆమోదించేలా చేసుకున్నారు. పార్టీ పెడుతానని కూడా ప్రకటించేశారు. అంతలోపు జాగృతి జనం బాట పేరుతో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ జిల్లాలను చుట్టేస్తున్న కవిత..పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పార్టీ ఏర్పాటు, గుర్తు రావడానికి టైమ్ పట్టే అవకాశం ఉండటంతో..ఈ లోపే రాబోతున్న మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారట కవిత.
తన మద్దతుదారులను పోటీ చేయించి..బీఆర్ఎస్‌కు తన సత్తా ఏంటో చూపించే స్కెచ్ వేస్తున్నారట కవితక్క. తన మద్దతుదారులను ఇండిపెండెంట్‌గా పోటీ చేయిస్తే..ఈసీ..ఒక్కో చోట ఒక్కో అభ్యర్థికి ఒక్కో గుర్తును కేటాయించే అవకాశం ఉండటంటో కొత్త ప్లాన్ వేస్తున్నారట కవిత. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నారట కవిత.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ..నేషనల్ పార్టీ. ఈ పార్టీ సింబల్..సింహం గుర్తుకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. గతంలో మన రాష్ట్రంలో ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్యేలుగానూ ఈ గుర్తుతో గెలువగా..మరికొందరు నేతలు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేసిన దాఖలాలున్నాయి.
Also Read: ఏలూరు టీడీపీలో వైసీపీ కోవర్టులెవరు? చింతమనేని టార్గెట్ చేసింది ఎవరిని?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాలజితో పురుడు పోసుకున్న పార్టీ కావడం..ఆ పార్టీ సింబల్ కూడా పౌరుషానికి ప్రతీకగా ఉండే సింహం గుర్తు కావడంతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు నేతలు. ఈ క్రమంలోనే తన సొంత పట్టుతో పాటు సింహం గుర్తు తోడైతే పురపోరులో తన పవర్ ఏంటో తెలియజేయొచ్చన్నది ఆమె వ్యూహం అంటున్నారు. అందుకే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొని ఓ ఇండికేషన్ ఇచ్చారట కవిత.
ఆ పార్టీకి జన బలం పెరిగే ఛాన్స్
రెబల్స్‌కు కేరాఫ్‌గా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కవిత లాంటి కరిజ్మా లీడర్ తోడైతే ఆ పార్టీకి జన బలం పెరిగే ఛాన్స్ ఉండటంతో..ఆ పార్టీ రాష్ట్ర నేతలు సైతం కవిత ప్రపోజల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. అయితే సెంటిమెంట్, జాతకాలను బాగా నమ్మే కవితకు..సింహం గుర్తు పొలిటికల్‌గా కలిసి వస్తుందని జ్యోతిష్యులు, పండితులు చెప్పారట.
అందుకే సింహం సింబల్‌తో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారట. గతంలో ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసిన బీఆర్ఎస్ అసంతృప్త నేత రంగినేని మనీషా ద్వారా..ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సత్తా చాటాలనేది కవిత ప్లాన్ అంటున్నారు. ఇదే తరహాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ మున్సిపాలిటీలపై కూడా కవిత ఫోకస్ పెట్టారని..బీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవితకు ఇమేజ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవితకు సొంతంగా కొంత ఇమేజ్ ఉండటంతో పాటు సింహం గుర్తు కూడా తోడైతే చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారట. అదే సమయంలో తన పార్టీ ద్వారా మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుక కవిత ప్లాన్ చేస్తుండటంతో ఆదిలాబాద్ నుంచే పురపోరులో సత్తా చాటేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ప్రధానంగా ఉత్తర తెలంగాణాపైనే ఆమె ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడే బీఆర్ఎస్ బలంగా ఉండటంతో కారు పార్టీని దెబ్బతీయడమే ఆమె లక్ష్యమనే టాక్ నడుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవిత సత్తా ఏంటన్నది రాబోయే మున్సిపల్ ఎన్నికలే తేల్చేసే ఛాన్స్ ఎక్కువగా కన్పిస్తుంది.