Telangana politics : బీఆర్ఎస్ అధిష్టానానికి కవిత మాస్టర్ స్ట్రోక్.. ఇక వారి ప్రయత్నాలు విఫలమైనట్లేనా..?

Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీ పేరును ప్రకటించారు.

Telangana Rashtra Sena

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని మున్సీరాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో భారీగా పాల్గొన్న జనసంద్రోహం మధ్య కొత్త పార్టీ పేరును ప్రకటించిన కవిత.. వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ అధిష్టానంకు కవిత బిగ్ షాకిచ్చారు.

Also Read : Kavitha TRS Party : కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే మీనింగ్ ఇదే.. జెండా గుర్తులు ఇవే.. దేనికి సూచిక అంటే..

మాజీ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. టీఆర్ఎస్ పార్టీతో ప్రజల్లోకి వెళ్లి తెలంగాణకోసం సుదీర్ఘంగా పోరాటం సాగించారు. వందలాది మంది బలిదానాలు, తెలంగాణ ప్రజలు, కేసీఆర్ పోరాటం ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించింది. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటంలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంతో కీలకం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ పార్టీ అని ముద్ర పడింది. అదే పార్టీ పేరుతో కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చారు.

ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. రెండో‌సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కొద్దికాలంకు టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేశారు. అయితే, గత రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కాగా.. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ పార్టీగా మార్చాలని పార్టీ శ్రేణుల నుంచి అధిష్టానంకు విజ్ఞప్తులు వస్తున్నట్లు తెలుస్తోంది.

పలువురు పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ పార్టీగా మార్చాలని బహిరంగంగానే పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో బీఆర్ఎస్ పార్టీని కాస్త మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత తన కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించి బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచనకు అడ్డుకట్ట వేస్తూ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లయిందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.