ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందిస్తూ..బీసీ రిజర్వేషన్లకు, కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.
మల్లన్న కామెంట్స్‌కు నిరసనగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు. ఈ సమయంలో మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వివాదం మరింత పెద్దదైంది. తీన్మార్ మల్లన్నపై అనర్హత వేటు వేయాలని మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత. సేమ్‌టైమ్ డీజీపీ ఆఫీస్‌లోనూ కంప్లైంట్ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న కూడా కవితపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మల్లన్న ఆఫీస్ మీద దాడిని అందరూ ఖండిస్తున్నా..కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహచర ఎమ్మెల్సీ, అందులోనూ మహిళ అయిన కవితపై మల్లన్న వ్యాఖ్యలు సరికాదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతలెవ్వరు స్పందించకపోవడం చర్చకు దారి తీస్తోంది. చివరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. కానీ బీఆర్ఎస్ కీలక లీడర్లు ఎవరూ రియాక్ట్ కాలేదు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు కేటీఆర్, హరీశ్ ఎవ్వరూ ఖండించలేదు. ప్రతి అంశంపై ట్వీట్ చేసే కేటీఆర్, హరీశ్ కూడా కవిత Vs తీన్మార్ మల్లన్న ఎపిసోడ్‌పై సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో కవితను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దూరం పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయడం, అది లీక్ అవ్వడం, ఆ తర్వాత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు గుప్పించడం వంటి పరిణామాలతో..కేసీఆర్ ఫ్యామిలీ ఆమెకు దూరంగా ఉంటూ వస్తోంది.
కవితతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ..
బీఆర్ఎస్ నేతలు కూడా కవితతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటువంటి సమయంలో కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం, అది కాస్త వివాదంగా మారినా..కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలెవ్వరు స్పందించకపోవడంతో కవితను పూర్తిగా కారు నుంచి దించేశారన్న ప్రచారం అయితే జరుగుతోంది.
తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మాత్రం ఖండించారు. అంతే తప్ప మిగతా ఎవ్వరు రెస్పాండ్ కాలేదు. ఆఖరికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మల్లన్న కామెంట్స్‌ను ఖండించగా.. బీఆర్ఎస్ నుంచి మాత్రం స్పందన కరువైంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించకున్నా పీసీసీ చీఫ్ రియాక్ట్ అవడంపై తీన్మార్ మల్లన్న సీరియస్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అధికారిక ఒప్పందం నడుస్తుందన్న మల్లన్న..మొన్నటి మంత్రి వర్గ విస్తరణ అప్పుడే కవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఉండే అన్నారు. ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని హాట్ కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు మల్లన్న.దీంతో కవితతో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లేనా.? లేక కవితను ఫ్యామిలీ, పార్టీ పక్కన పెట్టేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇంత వివాదం జరుగుతున్నా ఎవరూ రియాక్ట్ కాలేదంటే కవిత, కేటీఆర్ మధ్య చాలా గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తోంటే ఇప్పట్లో కేసీఆర్ కవితను చేరదీసే అవకాశాలు కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌తో కవిత కూడా బీఆర్ఎస్‌కు మరింత దూరం కావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో కవిత అడుగులు ఎటువైపు పడుతాయో.? ఆమె బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారో..లేక గుడ్‌బై చెప్తారో లేదో చూడాలి మరి.