ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీరు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. డ్యాడీని ఏమన్నా ఊరుకోనంటారు. అన్నతో విభేధాలు లేవంటారు. బీఆర్ఎస్ నాయకులను లిల్లీపుట్ లు అంటూ డైరెక్ట్ అటాక్ చేస్తుంటారు. పిలిస్తేనే బీఆర్ఎస్ సభకు వెళ్తానంటారు. ఓసారి పార్టీనే తనదంటారు. ఇలా ఒక్కోసారి ఒక్కో స్టేట్‌మెంట్ ఇస్తూ అటు బీఆర్ఎస్ కేడర్ ను కన్‌ఫ్యూజన్ చేస్తున్నారా… అక్క కన్ ఫ్యూజ్ అవుతున్నారా అర్థం కాక జనం తలలు పట్టుకుంటున్నారు.
ఇంతకీ ఆమె బీఆర్ఎస్‌లోనే ఉన్నారా.? లేరా అన్న డైలమాను మాత్రం తన డైలాగ్ లతో , ఎత్తులతో కంటిన్యూ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఇష్యూలో బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ తీరును విమర్శిస్తే..కవిత మాత్రం కాంగ్రెస్ కార్యకర్తల కంటే ముందే సంబరాలు చేసుకున్నారు. పైగా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ ఎస్ తన దారిలోకి రావాల్సిందేనన్నారు. పైగా కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే బీఆర్ఎస్ కంటే ముందే కవిత ధర్నా చేశారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ సభ పెడుతామంటే అంతకంటే ముందే కవిత నిరాహార దీక్ష చేశారు. ఇలా ప్రతీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఓ అడుగు ముందే ఉండే ప్రయత్నం చేస్తున్న కవిత..ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై కూడా గులాబీ పార్టీ కంటే ముందే లీగల్ ఫైట్‌కు రెడీ అవుతున్నారట.
Also Read: రాజధానికి రాజముద్ర.. చట్టబద్ధత ఇంకెప్పుడు..?
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను ఛాలెంజ్ చేస్తూ న్యాయపోరాటం చేయబోతున్నారట కవిత. ఇప్పటికే లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో ఆమె సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై లీగల్ ఫైట్ చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇదే అంశంపై కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో పీసీ ఘోష్ రిపోర్ట్‌ను బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో పాటు ప్రముఖ న్యాయవాదులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల టాక్. దేశంలోని పలు రాష్ట్రాల్లో గతంలో వేసిన జ్యుడీషియల్ కమిషన్లు..ఆయా నివేదికలు..వాటిని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేసి ఆరోపణల నుంచి విముక్తి పొందిన కేసులపై ఇప్పటికే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది.
నిజం లేదని నిరూపించాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ
ఇలాంటి కేసుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులతో పాటు అందుకు సంబంధించిన జడ్జిమెంట్లను పరిశీలిస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యలను న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయడంతో పాటు రేవంత్ సర్కార్ చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని నిరూపించాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ ఉంది. క్యాబినెట్ కలెక్టీవ్ డెసిషన్స్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే బాధ్యుడని అనడం కరెక్ట్ కాదని అంటోంది గులాబీదళం. కేసీఆర్‌పై అవినీతి మచ్చ వేసి ఆయన ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులను చిత్తు చేస్తామంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇటువంటి సమయంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై తాను కూడా న్యాయపోరాటం చేయాలని కవిత ఎత్తు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఒకే పార్టీ నుంచి ఇలా వేరువేరుగా కోర్టులను ఆశ్రయిస్తే బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ గందరగోళంలో పడే అవకాశం ఉంది. అందులోనూ బీఆర్ఎస్ కంటే ముందు కోర్టుకెళ్లి తాను పైచేయి సాధించాలని కవిత భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు అంశాల్లో కవిత చేపడుతున్న కార్యక్రమాలు, సొంత పార్టీ నేతల టార్గెట్‌గా ఆమె మాట్లాతున్న మాటలు బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడేమో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై న్యాయపోరాటం చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోగా.. అంతకంటే ముందు తానే కోర్టుకెళ్లాలని కవిత ప్రయత్నిస్తుండటం గులాబీ పార్టీలో ఆందోళనకు కారణమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. అప్పర్ హ్యాండ్ సాధించాలనే ప్లాన్‌తో.. అటెన్షన్ గ్రాబింగ్ స్కెచ్‌తో కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కారు పార్టీ క్యాడర్ ను, లీడర్లను కన్‌ఫ్యూజన్ చేస్తున్నాయట.
అయితే ఇదంతా తన తండ్రి కేసీఆర్‌కు దగ్గరయ్యేందుకే కవిత చేస్తున్న ప్రయత్నమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి గళం వినిపించినప్పటి నుంచి కవిత పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. కేటీఆర్‌తో సహా ఎవరితో గ్యాప్ ఉన్నా పెద్దగా ఇబ్బందేం లేదు కానీ..కేసీఆర్ కోపం కంటిన్యూ అయితే మాత్రం తనకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో కవిత ఉన్నారట. తన తీరుతో డాడీ హర్ట్ అయి ఉంటే..ఇలాంటి యాక్టివిటీతో దగ్గరయ్యే స్కెచ్ వేస్తున్నారట. కవిత వేస్తున్న ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..గులాబీ బాస్ నుండి ఆమెకు ఎప్పుడు పిలుపువస్తుందో చూడాలి మరి.