సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Kcr : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టనుంది సీజేఐ బెంచ్. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో పవర్ కమిషన్ వేసిన విషయం తెలిసిందే.

విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను (పవర్ కమిషన్) రద్దు చేయాలని ఇటీవల హైకోర్టుల కేసీఆర్ పిటిషన్ వేశారు. అయితే అక్కడ ఆయనకు చుక్కెదురైంది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్.

కాగా, విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఈఆర్ సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ అని, దీనిపై విచారణ కమిషన్ వేయకూడదని వాదిస్తున్నారు.

Also Read : మాజీ మంత్రి హరీశ్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసల వర్షం