ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మొదటి ముద్దాయి కేసీఆర్.. పాస్‌పోర్టు సీజ్ చేయాలి: రఘునందన్ రావు

మార్చి 19న రాత్రి 10.15కి సీఎం రేవంత్, మాజీమంత్రి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారని.. రెండు గంటలపాటు ఇద్దరు విమానంలో ఏం మాట్లాడుకున్నారో బయటికి తెలియాలన్నారు రఘునందన్.

Raghunandan rao on phone tapping : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడు సీఎం రేవంత్ అయితే రెండో బాధితుడిని తానేనంటున్నారు బీజేపీ నేత రఘునందన్ రావు.. ట్యాపింగ్ కేసులో పాత్ర ఉన్న ప్రతీ ఒక్కరినీ శిక్షించాల్సిందేననేది ఆయన డిమాండ్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా రాజకీయదుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులోకి బీజేపీ ఎంటరైంది.. దీంతో డైలాగ్ వార్ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కించనుంది..

రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు..
ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు తాము కూడా ఉన్నామంటున్నారు బీజేపీ నేతలు. తన ఫోన్‌తో పాటు బీఎల్ సంతోష్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ట్యాపింగ్ టాస్క్‌లో ఉన్నోళ్లందరినీ వరుస పెట్టి విచారణ చేసి.. అరెస్ట్ చేయాల్సిందేనంటున్నారు. అప్పటి డీజీపీని కూడా ఈ కేసులో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మొదటి ముద్దాయి కేసీఆర్
ట్యాపింగ్ వ్యవహారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులను అమెరికాకు ఎవరు పంపారో తెలియాలని డిమాండ్ చేశారు రఘునందన్. ఈ కేసులో మొదటి ముద్దాయిగా మాజీ సీఎం కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావుని పెట్టాలంటున్నారు రఘునందన్ రావు. మూడో ముద్దాయిగా అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరును చేర్చాలన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రోజు ముగ్గురు మాజీమంత్రులు రహస్య సమావేశం అయ్యారని చెప్పుకొచ్చారు రఘునందన్.

Also Read: లోక్‌స‌భ‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్: కేటీఆర్

ఒకే విమానంలో రేవంత్, హరీష్ రావు
మార్చి 19న రాత్రి 10.15కి సీఎం రేవంత్, మాజీమంత్రి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణం చేశారని.. రెండు గంటలపాటు ఇద్దరు విమానంలో ఏం మాట్లాడుకున్నారో బయటికి తెలియాలన్నారు రఘునందన్. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటారా లేక నిజాలు తేలుస్తారా అనేది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. తనకు నోటీసులు ఇస్తే తన దగ్గరున్న ఆధారాలు ఇస్తానన్నారు రఘునందన్.

Also Read: శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు: ఎర్రబెల్లి దయాకర్ రావు

కోమటిరెడ్డి ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం
ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎప్పుడు, ఎంతకు కొన్నారో బయటపెట్టాలన్నారు రఘునందన్. నచ్చినట్టుగా విచారణ జరిపించడం కాకుండా వాస్తవాలు బయటికి వచ్చి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలన్నారు. తాను ఒక బాధితునిగా మాట్లాడుతున్నానని చెప్పారు రఘునందన్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణం ఫోన్ ట్యాపింగే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌గానే నడించింది. బీజేపీ లీడర్ల కామెంట్స్‌తో రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పుడు ఈ కేసు ఎంత దూరం వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది.

ట్రెండింగ్ వార్తలు