లోక్‌స‌భ‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్: కేటీఆర్

అక్కడ రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు.

లోక్‌స‌భ‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్: కేటీఆర్

KTR on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్‌స‌భ‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా బడే భాయ్ మోదీ మంచివాడని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అవకాశవాద రాజకీయాల కోసమే దానం నాగేందర్ పార్టీ మారారని విమర్శించారు. సికింద్రాబాద్ లో పద్మారావును గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

”అక్కడ రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటే, రేవంత్ మాత్రం బడే భాయ్ బాగుండు అంటున్నారు. అక్కడ అదానీ మంచోడు కాదు అంటే, రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అంటాడు. అక్కడ రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు దాటవ”ని కేటీఆర్ అన్నారు.

రేవంత్‌కు కేటీఆర్ సవాల్
”ఒకవైపు ఇసుక దందా, మరోవైపు రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బిల్డర్లను, రియాల్టర్లను బెదిరించడం లాంటి వార్తలన్ని బయటకు రాకుండా స్కామ్‌ల‌ పేరు చెప్పి, ఈ వార్తలనే టీవీలలో తిప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మూడు నెలలుగా ఎందుకు బిల్డింగ్‌ల‌కు అనుమతులు ఇవ్వడం లేదు? డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని ఢిల్లీకి 2500 కోట్ల రూపాయలు పంపింది నిజం కాదా?

రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని జేబుదొంగ లెక్క తిరుగుతున్నాడు. పేగులు మేడలేసుకుంటా అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. ఈసుంటోడు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కరెంటు ఇయ్యడానికి, రైతుబంధు ఇయ్యడానికి, మహిళా మణులకు 2500 ఇయ్యడానికి, 4000 పెన్షన్లు ఇయ్యడానికి చేతకాదు కానీ ఇవన్నీ కవర్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్, స్కాముల అంటూ వార్తలు రాపిచ్చుకుంటున్నాడు. నీ చేతులలో అధికారం ఉంది కదా ఏం చేస్తావో చెయ్.. ఎవరెవరు, తప్పులు చేసినా వాళ్ళ పైన చర్యలు తీసుకో” అంటూ కేటీఆర్ సవాల్ చేశారు.

Also Read: రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గర అద్దెకు ఇల్లు తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు: నిరంజన్

దానంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశారని కేటీఆర్ అన్నారు. ”అధికారంలో ఉన్నప్పుడు రావటం, ఉండటం కాదు.. కష్ట కాలంలో పార్టీలో నిలబడి ఉన్నప్పుడే నిజమైన నాయకులు అనిపించుకుంటారు. అవకాశవాద రాజకీయాల కోసం పార్టీ మారారు. ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండు పడవల మీద నడవటం మంచిది కాదు. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశాం. అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన్ను అనర్హుడుగా ప్రకటింపజేస్తామ”ని కేటీఆర్ చెప్పారు.