రేవంత్ ఇంటికి దగ్గర అద్దెకు ఇల్లు తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు: నిరంజన్

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టుల కదలికల కోసం వాడే డివైస్ ను కాంగ్రెస్ నాయకులకు వాడారని నిరంజన్ ఆరోపించారు.

రేవంత్ ఇంటికి దగ్గర అద్దెకు ఇల్లు తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు: నిరంజన్

TPCC Senior Vice President Niranjan

Updated On : March 26, 2024 / 2:25 PM IST

TPCC Senior Vice President Niranjan: పోలీసులే సైబర్ నేరాలకు పాలపడుతున్నారంటే వ్యవస్థలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో అర్ధమవుతోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గాంధీ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికార దుర్వినియోగానికి పాలపడిందని ఆరోపించారు.

తెలంగాణ పోలీసులు అంటే గొప్పగా చెప్పుకునేవారని, ఇప్పుడు సిగ్గుపడే విధంగా పరిస్థితి దిగజారిందని వాపోయారు. ముగ్గురు ఉన్నతాధికారులు అధికారులు కీలకమైన రెవెన్యూ, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆవేదన చెందారు. రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మావోయిస్టుల కదలికల కోసం వాడే డివైస్ ను కాంగ్రెస్ నాయకులకు వాడారని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పటి డీజీపీ, హోమ్ మంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిపై ప్రక్షాళన చేస్తుంటే, కొందరు అధికారులు మోకాలు అడ్డుతున్నారని కూడా అనుమానం కలుగుతోందన్నారు. ప్రణీత్ రావు బ్యాచ్ వ్యాపారస్తులను కూడా బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దండుకుందన్నారని.. ఈ విషయంలో డీజీపీ, హోమ్ సెక్రెటరీకి లేఖ రాస్తామన్నారు.

Also Read: శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు: ఎర్రబెల్లి దయాకర్ రావు