Kcr: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న ఉత్కంఠకు తెరపడింది. రేపటి సిట్ విచారణకు తాను హాజరుకాలేనని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. రేపటి సిట్ విచారణకు హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఈ మేరకు సిట్ నోటీసులకు ఆయన రిప్లయ్ ఇస్తూ లేఖ రాశారు. విచారణకు మరింత సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. మరో తేదీన ఎంక్వైరీకి హాజరవుతానని లేఖలో తెలిపారు కేసీఆర్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ ఎక్కడ కోరితే అక్కడ విచారించేందుకు సిద్ధమని కూడా సిట్ బృందం తెలిపింది. సిట్ నోటీసులపై న్యాయ నిపుణులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. రేపటి సిట్ విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణం మున్సిపల్ ఎన్నికలే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల ఘట్టం రేపటితో పూర్తవుతుంది.
నామినేషన్ల దాఖలుకు రేపు చివరి రోజు. ఎవరెవరు బరిలో ఉండాలి, ఎవరు ఉండొద్దు, ఎవరెవరు ఉపసంహరించుకోవాలి ఇలాంటి చాలా కీలక అంశాలపై బీఆర్ఎస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్న ఈ సమయంలో విచారణకు వెళ్లొద్దని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ సీరియస్ నెస్ ని విచారణ పేరుతో పక్కకు మళ్లుతుందనే ఆలోచనతో రేపటి విచారణకు వెళ్లొద్దని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. రేపు ఒక్క రోజు మినహాయించి ఏ రోజైనా తాను విచారణకు సిద్ధంగా ఉన్నానంటూ జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ లేఖ పంపారు.