Kcr
KCR: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పడిన కష్టం గురించి వివరించారు. తెలంగాణ కోసం తాము పదవులు త్యాగం చేశామని.. కానీ కాంగ్రెస్ పదవుల కోసం తెలంగాణను త్యాగం చేసిందని అన్నారు.
తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సమయంలో నాకు ధనబలం లేదు.. గూండాల తండాల బలం లేదు.. మీడియా బలం లేదు. ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన తెలంగాణ సాధించిన అని తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నిమ్స్ డాక్టర్లు తనను బెదిరించారని, రేపో ఎల్లుండో కోమాలోకి వెళ్లావని, దీక్ష విరమించాలని తనపై ఒత్తిడి తెచ్చారని, కానీ తాను ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు వెళ్లానని తెలిపారు.
ఇక నాగార్జున సాగర్ అభివృద్ధి గురించి మాట్లాడారు.. నందికొండ అభివృద్ధిని తాను చూసుకుంటానని తెలిపారు. భరత్ విజయం సాధించిన తర్వాత అభివృద్ధి అంటే ఎలా వుంటదో చూపిస్తామని తెలిపారు. ఏడాదిన్నరలో నెల్లికల్ లిఫ్ట్ పనులు పూర్తిచేస్తామని, ఆ నీళ్లలో నియోజకవర్గ ప్రజలు గెంతులు వేసి కేరింతలు కొడుతుంటే చూడాలనేది తన కోరికన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరెంటు నుంచి నీళ్ల వరకు అన్ని గోసలను ఏ విధంగా తీర్చిందో మీ కండ్ల ముందే ఉన్నాయని, ఇవన్నీ ఆలోచించి ఓటువేయాలని కోరారు.
గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే పాలు రావని అన్నారు. మాట్లాడితే తనది ముప్పై ఏండ్ల చరిత్ర అని చెప్పుకొనే పెద్దమనిషి సాగర్‌కు చేసిందేమీ లేదని, ఈ ముప్పై ఏండ్లలో సాగర్‌లో కనీసం ఓ డిగ్రీ కాలేజీకి కూడా దిక్కులేదని విమర్శించారు. టీఆర్ఎస్ గెలిచిన వెంటనే సాగర్ లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక ఈ మద్యే హాలియాకు డిగ్రీ కాలేజీ ఇచ్చినట్లు తెలిపారు కేసీఆర్..
భిక్షమెత్తయిన లిఫ్ట్ పూర్తీ చేస్తా
నా మిత్రుడు నర్సింహయ్యను కోల్పోవడం చాలా బాధగా ఉంది. లెఫ్ట్ సిద్ధాంతంతో ఆయన ఎందరో పేదవారి బ్రతుకులు మార్చారు. ఇక ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ మీ ముందుకు వచ్చాడు. విద్యావంతుడు.. సేవచేయాలని మీ ముందుకు వచ్చాడు.. ఆయనకు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. భరత్ విజయం సాధిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఒకసారి ఆలోచించండి అని కేసీఆర్ అన్నారు.
నియోజకవర్గంలో భరత్ గాలి బాగానే ఉందని, అవి ఏప్రిల్ 17 న ఓట్ల రూపంలో బాక్సుల్లో పడాలని కేసీఆర్ కోరారు. ట్లెట్ల భగత్‌కు ఓట్లు దుంకుతయో.. అట్లట్ల మీ నెల్లికల్ లిఫ్ట్ నీళ్లు దుంకుతయని హామీ ఇస్తున్న. అలంపూర్ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ నాయకులే పదవుల కోసం ఒంగి లొంగి ఉన్న కాలంలో అక్కడి ఆర్డీఎస్ కాలువ ఆగమైపోతే దానిపై తుమ్మిళ్ల దగ్గర లిఫ్ట్ పెట్టినం. ఆ లిఫ్ట్ బాగా సక్సెస్ అయింది. మొన్న ఎలక్షన్ సమయంలో అక్కడికి పోయిన. తుమ్మిళ్లలో నీళ్లు దుంకినట్లు ఓట్లు దుంకాలి అన్న.. అక్కడ 50 వేల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు.
ఇక్కడ కూడా అదే జరగాలని కేసీఆర్ కోరారు. తిరుమలగిరిసాగర్‌కు నీళ్లిచ్చే లిఫ్ట్‌ను ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానని మా మంత్రి సవాల్ విసిరారు. ఆయన చెప్పింది 100 శాతం కరెక్ట్.. భిక్షమెత్తయినా లిఫ్ట్ ని పూర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. నియోజకవర్గంలో బ్రిడ్జ్ ల నిర్మాణం చేపడతామని, అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటన్నింటిని పరిష్కరిస్తానని తెలిపారు.