TRS Chief KCR: గులాబీ బాస్ కేసీఆర్‌ మళ్లీ యాక్టివ్‌గా కనపడేది అప్పుడేనా?

ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్- పార్టీ కార్యక్రమాలను కూడా..

KCR

గులాబీ బాస్ కేసీఆర్‌ గత కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉండడం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మినహాయిస్తే ఎలాంటి కార్యక్రమాలలో ఆయన పాల్గొనలేదు. కేసీఆర్‌.. మరికొన్ని రోజుల పాటు సైలెంట్‌గానే ఉండే అవకాశం కనిపిస్తోంది. కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే తప్ప కేసీఆర్ పొలిటికల్‌ స్క్రీన్‌పై మళ్లీ యాక్టివ్ కనిపించే ఛాన్స్‌ లేదని తెలుస్తోంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినా వార్తే…. మౌనంగా ఉన్నా వార్తే. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు అదే పంథాను కొనసాగిస్తున్నారు కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమం సాగిన 12 ఏళ్ల పాటు కేసీఆర్‌ సైలెంట్‌గా ఉంటే వ్యూహాత్మక మౌనం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి.

తెలంగాణలో రెండు విడతలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కూడా అవసరమనుకుంటే తప్ప మీడియా ముందుకు వచ్చేందుకు కేసీఆర్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే కేసీఆర్‌ మీడియా సమావేశాలను ఏర్పాటు చేసినా… బహిరంగ సభలో పాల్గొన్నా….. ఏదో ప్రత్యేకత ఉంటుందని అందరూ భావిస్తారు. తన అనర్గళమైన ప్రసంగాలతో తెలంగాణ ప్రజలకు ఎంతో చేరువయ్యారు కేసీఆర్‌. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేత హోదాలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ కొన్ని నెలలుగా సైలెంట్‌గా ఉంటున్నారు.

పార్టీ అంతర్గత సమావేశాల్లో..
రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన తరువాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్‌. అప్పటికే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేశాయి దర్యాప్తు సంస్థలు. కవిత అరెస్టు.. రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని గులాబీ పార్టీ విమర్శలు చేస్తున్నా…. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు కేసీఆర్‌. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం అధినేత కేసీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికి అయినా బాధ ఉండదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అగ్నిపర్వతంలా రగిలి పోతున్నా సైలెంట్‌గా ఉండక తప్పడం లేదన్నారు కేసీఆర్‌. ఈ వ్యాఖ్యలను గమనిస్తే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నది అంచనా వేయవచ్చు. ఈ కారణంగానే పార్టీ నేతలను, కార్యకర్తలను కలుసుకునేందుకు కేసీఆర్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

పార్టీ కార్యక్రమాల నిర్వహణపైన గులాబి నేతలు కసరత్తు చేసి కార్యాచరణను సిద్ధం చేసినా కేసీఆర్‌ ఆసక్తి చూపడం లేదు. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్- పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెయిల్‌ తర్వాతే పార్టీ నేతలకు పూర్తిస్థాయిలో కేసీఆర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు కేసిఆర్ పెద్దగా ఆసక్తి చూపడంలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. దీంతో కల్వకుంట్ల కవితకు కూడా త్వరలో బెయిల్ మంజూరు అవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. అయితే సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్‌ వచ్చే వరకు కేసీఆర్‌ మౌనంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.

Also Read: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. పార్టీ, క్యాబినెట్, నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నది వీరే..

ట్రెండింగ్ వార్తలు