GST Telangana share: కేంద్రం ప్రకటించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాన నరేంద్ర మోడీకి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా జీఎస్టీ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు.
వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రా ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలను ఆదుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రతిపాదనలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని లేఖలో తెలిపారు. జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అవుతుందని తెలిపారు. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన దేశంగా మారుతుందని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో రుణాలపై ఆంక్షలు సరైనది కాదని కేసీఆర్ తెలిపారు.
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ బిల్లును సమర్థించిందని తెలిపారు. జీఎస్టీ బిల్లుపై ముందుగా స్పందించి వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని భావించామన్నారు. సీఎస్టీ రద్దు సమయంలో పూర్తి పరిహారాన్ని అందజేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు. రాష్ట్రాలు సీఎస్టీ పరిహారాన్ని తిరస్కరించాయి.
ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదన్నారు. కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్లో నుంచి తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను నష్ట పోయిందని తెలిపారు. రాష్ట్రాల అవసరాలు, పేమేంట్ల భారం పెరిగి పోయిందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌లకు కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని సీఎం లేఖలో తెలిపారు.