నాగరాజును చంపేశారంటున్న కుటుంబసభ్యులు

  • Publish Date - October 17, 2020 / 07:38 AM IST

Keesara Ex Tahsildar Nagaraju : తెలంగాణలో సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య కలకలం రేపుతోంది. నాగరాజు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజుది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు.



ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తామంటున్నారు. కీసర ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. కోటి రూపాయల లంచం కేసులో అరెస్టై జైల్లో ఉన్న నాగరాజు ఈ నెల 14న చంచల్‌గూడ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నాగరాజు మృతిపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమయ్యారు.

ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ చంచల్‌గూడ జైల్లో నాగరాజు టవల్‌తో ఉరివేసున్నాడు. నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్‌ డెత్‌గా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నాగరాజుది ముమ్మాటికి హత్యేనని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జైల్లో మిగతా ఖైదీలు ఉండగా.. ఆత్మహత్య సులభం కాదని.. టవల్‌తో ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.



ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని.. అందుకు తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయన్నారు. నాగరాజు ఏ తప్పు చేయలేదని ఉద్దేశ పూర్వకంగానే కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.



అయితే నాగరాజు డెత్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోవడానికి ముందు అర్థరాత్రి వరకు నాగరాజు నిద్రపోలేదని పోలీసులు గుర్తించారు. అతన్ని మంజీరా బ్యారక్‌ రూం నెంబర్ 11లో ఉంచగా.. అతనితో పాటు మరో నలుగురు ఖైదీలు ఉన్నారు. ఆత్మహత్యకు ముందు మిగతా ఖైదీలు పడుకున్నారా? లేక ఏమైనా గొడవ జరిగిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు