Telangana Cabinet Expansion: ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. రేపు(జూన్ 8) మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనుంది. సుదర్శన్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, అమీర్ అలీఖాన్ లను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు అందుబాటులో ఉండాల్సిందిగా నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ లోకి తీసుకునే వారికి అర్థరాత్రి తర్వాత ఫోన్లు చేసే అవకాశం ఉంది. ఇక, బీసీ కోటాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కూడా మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కోసం ఏడాదిన్నర నుంచి ఆశావహులు ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. మంత్రి పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. డజను మందికిపైగా నేతలు పదవులు ఆశిస్తున్నారు. అయితే పలు కారణాలతో ఇన్నాళ్లూ క్యాబినెట్ విస్తరణను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది హైకమాండ్. గవర్నర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాత్రికి గవర్నర్ హైదరాబాద్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రేపే మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు.
Also Read: కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి- కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
క్యాబినెట్ లో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతానికి మూడు బెర్తులను భర్తీ చేయనున్నారని సమాచారం. మంత్రివర్గంలోకి ముగ్గురిని తీసుకునేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మంత్రివర్గ కూర్పు ఉండనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం క్యాబినెట్ లో ఇద్దరు బీసీ నేతలు ఉన్నారు. బీసీ కులగణన జరిగిన నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్న భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఈ క్రమంలో బీసీ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి (ముదిరాజ్) కూడా మంత్రిపదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి ఉన్నారు. మొత్తంగా మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఓసీ, మైనారిటీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన వారికి అవకాశం దక్కనుందని సమాచారం.