కిసాన్ క్రెడిట్ కార్డు: ఇక అధిక వడ్డీలు తప్పినట్లే

వ్యవసాయమంటే ప్రతి రోజూ కష్టమే. ఏటా ఒక్కసారి దిగుబడి వచ్చే పంటలకు సంవత్సరమంతా పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, సాగు ఖర్చులు.. ఇలా పెట్టుబడులు కావాలసిన ప్రతిసారి రైతులకు డబ్బు తీసుకొచ్చుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు. అధిక వడ్డీకైనా సరే తప్పని పరిస్థితుల్లో పంటరుణాలు చేస్తుంటారు. ఇవన్నీ పాత కాలం విషయాలు. వీటన్నింటికీ చెక్ పెట్టాలనుకున్న వ్యవసాయ శాఖ కొత్త పద్ధతి తీసుకొచ్చింది. 

క్రెడిట్‌ కార్డు లాంటి వాటిని రైతులకు కూడా అందించాలని భావిస్తోంది. బ్యాంకులతో మాట్లాడి కార్డు ఇప్పించడం ద్వారా అధిక వడ్డీల నుంచి ఆదుకునే దిశగా అడుగులు వేస్తోంది. పలు రాష్ట్రాల్లో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నా, తెలంగాణలో పెద్దగా దక్కలేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకాడడం ప్రధానంగా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 29 వేల కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు అందులో సగం కూడా ఇవ్వలేదని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇటువంటి దారుణమైన స్థితిలో అధిక వడ్డీలు అయినా లెక్కచేయకుండా ప్రైవేట్ రుణాల వైపు మొగ్గుచూపుతున్నారు రైతులు. 

ప్రయోజనాలు:
విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, సాగు ఖర్చులు వంటి వ్యవసాయ అవసరాల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. ఇతర వ్యవసాయ సంబంధిత రోజువారీ అవసరాలకు కూడా క్రెడిట్ కార్డులు వాడుకోవచ్చు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ రైతు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పొందడానికి అర్హుడే. కొన్ని పరిమితుల మేరకు కౌలు రైతులకు ఇస్తారు. భూమి ఉన్న రైతు తన పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకెళ్లి సాధారణ డాక్యుమెంటేషన్‌ ద్వారా బ్యాంకులో పొందవచ్చు. రైతుకు బీమా కవరేజీ కూడా ఉంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు తీసుకున్న రైతులకు కేంద్రం రూపే కార్డులు ఇస్తుంది. వీటి సాయంతో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. 

18 నుంచి 75 ఏళ్ల వరకు వయస్సున్న ప్రతి రైతు అర్హుడే. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు దరఖాస్తు చేసేటప్పుడు గుర్తింపు కార్డుండాలి. ఓటరు ఐడి, పాన్, ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏదో ఒకటి సరిపోతుంది. తప్పనిసరిగా పట్టాదారు పాసు పుస్తకం కలిగిఉండాలి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు : 5,00,000 
వ్యవసాయ శాఖ లక్ష్యం : 25,00,000