Professor Kodandaram
Kodandaram – TJS: తెలంగాణ జన సమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయబోమని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. టీజేఎస్ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ప్రజాస్వామ్య తెలంగాణ (Telangana) కోసం ఇతరులతో కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ మేరకే తాము ప్రజా సంఘాలు, ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు.
అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కోదండరాంను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఆయన ముందు పెట్టాయని వార్తలు వచ్చాయి. ఈ పనిచేస్తే ఏఐసీసీ లేదంటే పీసీసీలో కీలక పదవి ఇస్తామని కూడా చెప్పారని ప్రచారం జరుగుతోంది.
కోదండరాం, జూపల్లితో చర్చలు
ఏఐసీసీ సెక్రెటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. రెండు గంటల పాటు జూపల్లి కృష్ణారావు ఇంట్లో చర్చలు జరిగాయని అన్నారు. జూపల్లి అడిగిన అంశాలపై ఆయనకు స్పష్టత ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన అనంతరం పార్టీలో పలువురు చేరతారని తెలిపారు.
తాము నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు కోదండరాం కూడా వచ్చారని సంపత్ కుమార్ చెప్పారు. పార్టీ విలీనం, కలిసి పని చేయడం వంటి విషయాలపై చర్చలు జరిపామని అన్నారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను కోదండరాం లేవనెత్తారని తెలిపారు. మళ్లీ అలా జరగకుండా చూస్తామని తాము ఆయనకు చెప్పామని అన్నారు. బీఆర్ఎస్ ను ఎలాగైనా సరే ఓడించాలని కోదండరాం అన్నారని తెలిపారు.