Thatikonda Rajaiah
Thatikonda Rajaiah : కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య నెలకొంటున్న విబేధాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం జాతరకు సంబంధించిన పనుల విషయంలో విబేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏకంగా మంత్రి ఇంటిని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ అంశంపై మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో కడియం శ్రీహరిపై సంచలన కామెంట్స్ చేశారు.
తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రి పదవిని గుంజుకునేందుకు కడియం శ్రీహరి స్కెచ్ వేశాడు. టీడీపీ నుంచి వచ్చిన వారితో జతకట్టి పక్కా ప్లాన్ వేశాడు. కడియంకు వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోడయ్యారు. మంత్రి కొండా సురేఖపై కుట్రలో ప్రధాన పాత్ర కడియం శ్రీహరిదే. బీసీ మహిళ అయిన మంత్రి కొండా సురేఖను వారు చిత్రహింసలకు గురిచేస్తున్నారు అంటూ రాజయ్య పేర్కొన్నారు.
బీఆర్ఎస్ లోనూ కడియం శ్రీహరి ఇలాంటి గ్రూపు రాజకీయాలు చేశాడు. కాంగ్రెస్ లోనూ అదే ప్లాన్ అమలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీలోని కొందరు మంత్రులు, నేతల తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని తాటికొండ రాజయ్య హెచ్చరించారు.
కొండా సురేఖపై రెడ్డి సామాజిక వర్గం నేతలు కుట్రలు చేయడం వాస్తవమేనని రాజయ్య అన్నారు. కేబినెట్లోని మంత్రుల కాంట్రాక్ట్ సంస్థలకే సీఎం రేవంత్ రెడ్డి బిల్లులు క్లియర్ చేస్తున్నాడు. 10 నుంచి 30శాతం వరకు కమిషన్లు ఇస్తేనే బిల్లులు రేవంత్ నుంచి క్లియర్ అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులకు మాత్రమే న్యాయం జరుగుతుందని తాటికొండ రాజయ్య విమర్శించారు.