Konda Surekha : కొండా సురేఖ ‘బిగ్ అప్‌డేట్’ ఏంటి? ఒక్క పోస్టుతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ!
Konda Surekha : మాజీ మంత్రి కొండా సురేఖ తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
- Harish Thanniru
- Updated on- September 4, 2026 / 01:31 PM IST
Konda Surekha
Konda Surekha : కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అంశం తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు చేరింది. తెలంగాణ కేబినెట్ నుంచి సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన అధికారిక సిఫార్సును రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం పంపించారు. కొద్దిసేపటికే గవర్నర్ శుక్లా ఆమోదం తెలపడంతో సురేఖ మంత్రి పదవిని కోల్పోయినట్లయింది. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని.. పార్టీకి రాజీనామా చేయనని చెప్పారు. అయితే, తాజా.. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కొత్త చర్చకు దారితీసింది.
Also Read : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్?
మాజీ మంత్రి కొండా సురేఖ శుక్రవారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. “ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్.. బిగ్ అప్‌డేట్ ఈజ్ కమింగ్ సూన్” అంటూ ఆమె పోస్టు పెట్టారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని చర్చ మొదలైంది.
కొండా సురేఖ తాజా పోస్టుతో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.. ఆమె కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక రాజకీయంగా ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడితే ఏ పార్టీలో చేరుతారు అన్నదే. కొండా సురేఖ తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి తదుపరి రాజకీయ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారా? అన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. అయితే ఆమె పోస్టులో మాత్రం ఎలాంటి వివరాలను వెల్లడించకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే కొండా సురేఖకు సంబంధించిన రాజకీయ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగిన నేపథ్యంలో.. తాజాగా ఆమె చేసిన ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. “ఇంతకీ ఆ బిగ్ అప్‌డేట్ ఏంటి?” అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
