చేవెళ్లలో మోదీ వేవ్.. అందుకే ఇంత మెజారిటీ వచ్చింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఎంపీ ఎన్నికల్లో పోలీసులు అసలైన తెలంగాణ పోలీసులు లాగా పనిచేశారని కితాబిచ్చారు. మెదక్ లో రఘునందన్ రావు గెలవడం సంతోషంగా ఉందని..

Konda Vishweshwar Reddy comments on his majority in Chevella

Konda Vishweshwar Reddy: కేంద్రంలో ఎవరు ఉంటే మంచిదో ప్రజలు ఆలోచన చేసి మోదీని గెలిపించారని చేవెళ్ల నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ వేవ్ చేవెళ్లలో వచ్చిందని అందుకే ఇంత మెజారిటీ వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగా ఓటు శాతం పెరిగిందని, శేరిలింగంపల్లిలో తమకు ఎక్కువ మెజారిటీ వచ్చిందని వెల్లడించారు. చదువుకున్న వారు కూడా బయటకు వచ్చి ఓటేశారని, బస్తీలలో సైతం బీజేపీకి లీడ్ వచ్చిందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో పోలీసులు అసలైన తెలంగాణ పోలీసులు లాగా పనిచేశారని కితాబిచ్చారు. మెదక్ లో రఘునందన్ రావు గెలవడం సంతోషంగా ఉందని.. డబ్బు, మద్యం అక్కడ పనిచేయలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి పరిధిలో బీజేపీకి పది సీట్లు వస్తాయి.

”తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు వచ్చేలా నా వంతు కృషి చేస్తా. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేలా కృషి చేస్తా. బీజాపూర్ హైవే పనులు పూర్తి చేసేలా కృషి చేస్తా. ఎంపీ లాడ్స్ అన్నీ గ్రామాలకు అందేలా చేస్తాను. కొలిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా గత రెండు టేర్మ్ లలో ఎలా పనిచేశామో అలాగే పనిచేస్తాం. పాలసీల్లో ఎలాంటి మార్పులు రావు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత పరిస్థితి చక్కబడుతుంది. అంతా కలిసి పనిచేస్తాం.

మతపరమైన పోలరైజేషన్ తోనే దేశంలో బీజేపీకి సీట్లు తగ్గాయి. మైనారిటీల మెదడులో విషం నింపింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వస్తే అధికారం లోకి వస్తే సెకండ్ క్లాస్ సిటిజన్ గా చూస్తారని ప్రచారం చేసింది. బీజేపీ ఒక మతానికి కాకుండా దేశంలో అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రతిపక్ష పార్టీలు చేతులు ఎత్తేశాయి. కేంద్ర మంత్రి అయితే నేను ప్రజలకు దూరం అవుతాను. పార్టీ ఏ పదవి ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. కేంద్ర మంత్రిగా అయితే దేశాభివృద్ధికి నా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటిని అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎంఎస్ఎంఈ లతోనే అధిక ఉద్యోగాలు వస్తాయి. బయోగ్యాస్ ఉత్పత్తి పైనా దృష్టి సారించాల”ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

Also Read: బీఆర్ఎస్ కుట్రతోనే కాంగ్రెస్ ఎనిమిది చోట్ల ఓడిపోయింది.. మోదీపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కాగా, లోక్‌స‌భ‌ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై 172897 ఓట్ల మెజారితో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మూడో స్థానంలో నిలిచారు.