Kondagattu Anjaneya Swamy : కొండగట్టు అంజన్న భక్తులకు శుభవార్త.. ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెర
Kondagattu Anjaneya Swamy : జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- Harish Thanniru
- Published on- November 14, 2026 / 02:36 PM IST
kondagattu anjaneya swamy nijaroopa darshan 2026
Kondagattu Anjaneya Swamy Nijaroopa Darshan : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న భక్తులకు ఆలయ అధికారులు అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత స్వామివారి నిజరూప దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక చందనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల అనంతరం 40 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత స్వామివారి నిజరూప దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తుల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక చందనోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఆరు రోజుల పాటు ఆలయంలో విశేష క్రతువులు, హోమాలు, జపాలు, పారాయణాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి ఇప్పటివరకు ఉన్న సింధూర లేపనాన్ని తొలగించి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇద్దరు జీయర్ స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.
నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు వరుసగా 40 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని చందన లేపనం లేకుండా దర్శించుకునే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 29వ తేదీన మండలాభిషేకం నిర్వహించి స్వామివారికి తొలి విడత చందన లేపనం చేయనున్నారు. అనంతరం ప్రతి మంగళవారం, శనివారం స్వామివారికి చందన లేపనం సమర్పించనున్నారు. ప్రత్యేక చందనోత్సవాలు, నిజరూప దర్శనానికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను ఆలయ ప్రధాన అర్చకులు కపిల్ శర్మ అంజన్ రెడ్డి వెల్లడించారు. ఆరు దశాబ్దాల తర్వాత లభిస్తున్న ఈ అరుదైన దర్శన అవకాశం నేపథ్యంలో కొండగట్టుకు భక్తుల రాక పెరిగే అవకాశం ఉంది.
