KTR
KTR: లగచర్ల ఘటన నిందితులతో సంగారెడ్డి సెంట్రల్ జైలులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రాబందులా మారారని విమర్శించారు. లగచర్ల ఘటనలో దాడి జరిగిన తరువాత బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. అరెస్టు చేసిన వారిని థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు పెట్టారు. మెజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్లను కొడతామని బెదిరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగచర్ల ఘటనకు కావాలనే రాజకీయ రంగు పులిమారన్న కేటీఆర్.. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే అని గుర్తుపెట్టుకోవాలని, మీ ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేపోమాపో పదవి పోతుందని రేవంత్ తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అంటూ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుంది. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఆయన బెదిరింపులకు ఎవరూ బడపడేవారు లేరు. 30, 40 కిలోల బరువులేని పిల్లలు కూడా కలెక్టర్ ని కొట్టారని కేసులు పెట్టారు. అవసరం అయితే, వారిని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మా పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు.