KTR
SLBC Tunnel Incident: నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎడమవైపు టన్నెల 14వ కిలో మీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పనుల్లో మొదటి షిప్ట్ లలో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30గంటల సమయంలో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది టన్నెల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. 43 మంది బయటయకురాగా.. మరో ఏడుగురు కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నట్లు సమాచారం. సఘటన స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాదంకు పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం అని విమర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీపడిపోవడం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
పైకప్పు కూలిన ఈ ఘటనలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడకుండా నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాలని కేటీఆర్ సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక బ్యారేజీలో కేవలం పిల్లర్ కుంగితే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలపై ఇప్పుడేంమంటారని కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ ను కాపాడేందుకు వాస్తవాలు దాచిపెట్టిన ప్రభుత్వం, కనీసం ఎస్ఎల్బీసీ సంఘటనపైనైనా పారదర్శకంగా దర్యాప్తు జరిపి ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.