నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : మాజీ మంత్రి కేటీఆర్

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

KTR

KTR : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో ‘మేక బతుకు’ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదివే సమయం దొరుకుతుంది. గల్ఫ్ వ్యధలు ఎవరినైనా ఆలోచింప చేస్తాయి. దుబాయిలో బుర్జు ఖలీఫాలే కాదు.. కార్మికుల అవస్థలు ఉంటాయి. వలస కార్మికుల వ్యధలు అన్నిచోట్ల అలాగే ఉంటాయి. తెలంగాణ కార్మికులు గల్ఫ్ వలస పోతున్నారు. ఉత్తర భారతదేశం హైదరాబాద్ కు కార్మికులు వలస వస్తున్నారని కేటీఆర్ అన్నారు.

Also Read : పెళ్లికి హాజరైన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ .. వాటి ధర ఎంతంటే?

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ యువతను రెచ్చగొట్టారని కేటీఆర్ అన్నారు. తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఆ ఇద్దరు ఉద్యోగాలు తెచ్చుకున్నారంటూ రేవంత్ రెడ్డి, రాహుల్ పై కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగులు ఇదే అంశాన్ని అడుగుతున్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దివాలాకోరుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు అయింది. మరో నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read : కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి నీతులు చెబుతావా.. దానం నాగేందర్‌పై కౌశిక్‌రెడ్డి ఫైర్

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.