మీ కళ్లు చల్లబడతాయంటే మా ఇళ్లను కూలగొట్టండి- సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్

కోమటిరెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకే సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Ktr (Photo Credit : Google)

Ktr : మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలపై మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, అదే కాంగ్రెస్ ఇప్పుడేమో కూల్చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కళ్లు శాంతిస్తాయంటే తమ ఇళ్లను కూలగొట్టాలని కేటీఆర్ అన్నారు. అంతేకానీ, పేదల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లొద్దని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే కొడంగల్ రెడ్డికుంటలో ఉన్న సీఎం ఇళ్లు కూల్చాలన్నారు.

రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు, ఆడపిల్లకు లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చేందుకు, రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట. వేటికీ పైసలే లేవట. పేదోళ్లకి ఇచ్చేందుకు పైసలు లేవట. కానీ, లక్షా 50వేల కోట్లు మాత్రం మూసీలో పోస్తారట. అందులో 25 లేదా 30వేల కోట్లు నొక్కేసి ఢిల్లీకి మూటలు పంపిస్తారు. అందుకోసమే ఇవాళ మూసీ పథకం పెట్టారు రేవంత్. కేసీఆర్ కాళేశ్వరం కట్టారు. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం 90శాతం కట్టారు. బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చేందుకు వాటిని కట్టారు. మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు వాటిని కట్టారు. మరి మూసీతో ఎంతమందికి, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తావు? ఎంతమంది రైతులకు నీళ్లు ఇస్తావు? సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? లేదు.

సుందరీకరణ చేస్తా, ఏందో చేస్తా అనడం తప్ప.. ఏం చేస్తాడో ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల కోసం, పైసలు నొక్కడానికే మూసీ సుందరీకరణ అంటున్నారు. పేదలకు ఇస్తే పైసలు రావు. అదే పెద్దవాళ్లకు, కాంట్రాక్టర్లకు ఇస్తే.. కమిషన్లు వస్తాయి. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్. ఆ పైసలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పంపి తన సీటు కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదు” అని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్.

Also Read : హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..! అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రెడీ..

అటు ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ట్రిపుల్ ఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్ట్ అని, అలాంటిది రూ.13వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కోమటిరెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకే సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.