KTR
Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ త్వరలోనే చాలామంది ప్రముఖులు బీఆర్ఎస్‌లో చేరతారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన తర్వాత గాంధీ భవన్‌లో తన్నుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే గందర గోళం, ఆగమాగమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు తనకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు 114 మంది తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని కేటీఆర్ అన్నారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 నియోజక వర్గాల్లో అభ్యర్థులు లేరని ఆరోపించారు.
రూ.42 కోట్లు దొరికాయి..
కాంగ్రెస్ లో డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో తాను చెప్పినట్టే కర్ణాటకలో అక్రమ డబ్బు జమ అవుతోందని అన్నారు. తెలంగాణకు తరలించడానికి సిద్ధంగా ఉన్న రూ.42 కోట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయని ఆరోపించారు. రూ.8 కోట్లు ఇంతకు ముందే కొడంగల్‌కు చేరినట్టు తమకు సమాచారం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రాతిపదికన ఎన్నికల్లో పోరాడం లేదని, తాము మాత్రం తొమ్మిదిన్నరేళ్లుగా చేసిన పనుల గురించి చెబుతున్నామని కేటీఆర్ తెలిపారు. తమ కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని అన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు.
ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వమంటూ తిడతారని కేటీఆర్ చెప్పారు. ఆయనకు అంత అహంకారమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ అని, ఏం రాసిస్తే అది చదువుతారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానం పలుకుతానని కేటీఆర్ చెప్పారు. మోదీని సీఎం కేసీఆర్ తిట్టినంతగా ఏ సీఎం కూడా తిట్టలేదని అన్నారు. బీజేపీతో స్నేహం ఉంటే ఆయనను ఎందుకు తిడతామని ప్రశ్నించారు. షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ 119 సీట్లలో పోటీ చేసినా తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. అలాగే, మోదీ, రాహుల్ గాంధీ ఇక్కడికొచ్చి పోటీ చేసినా అభ్యంతరం లేదని అన్నారు.
Gudivada Amarnath : ఇది లోకల్-నాన్ లోకల్‌కు జరుగుతున్న యుద్ధం, అందుకే విశాఖ రాజధానిపై విషం