రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, వెంటాడతాం: కేటీఆర్ వార్నింగ్

రుణమాఫీ పేరుతో రైతులకు ప్రభుత్వం టోపీ పెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

KTR on Crop Loan Waiver: రైతులకు ఎప్పటి లోపల పూర్తిగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్నదాతలకు రుణమాఫీ చేయాలన్నారు. రైతు రుణమాఫీపై మంత్రులు ఒక్కొలా మాట్లాడుతున్నారని, రూ. 2 లక్షల రుణమాఫీ పెద్ద అబద్దమని వ్యాఖ్యానించారు. రుణమాఫీపై రేపటి నుంచి ఆందోళనలు చేపడతామని తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తామన్నారు.

రుణమాఫీ పేరుతో రైతులకు ప్రభుత్వం టోపీ పెట్టిందని, సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే చాలా రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కోస్గి మండలంలో20 వేలకు పైగా రైతులు రుణం తీసుకుంటే 8,527 మందికి రుణమాఫీ జరిగిందని వెల్లడించారు. కొత్త ఆంక్షలతో రుణమాఫీకి సర్కారు కొర్రీలు పెడుతోందని, ఇది పచ్చిమోసగాళ్ల ప్రభుత్వమని మండిపడ్డారు. రుణమాఫీకి మాదిరిగానే రైతుబంధును చేస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు.

రుణమాఫీ అందక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని, అన్నదాతల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. 70 లక్షల మంది రైతులను సీఎం వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, రుణమాఫీ జరిగేవరకు వెంటాడతామని హెచ్చరించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఛీటింగ్‌పై మా ఫైటింగ్ ఆగదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు