కూకట్‌పల్లి రేణు హత్య కేసు.. రాంచీలో దొరికిన నిందితులు.. ఆ ఒక్క క్లూతో ఎలా దొరికారంటే?

నిందితులు హఫీజ్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు ఎంఎంటీఎస్‌ టికెట్లు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. స్టేషన్‌లో పోలీసులను చూసి హఫీజ్‌పేట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారని అన్నారు.

Kukatpally Renu Case

Kukatpally Renu Case: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో ఇటీవల జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితులను రాంచీలో పట్టుకున్నారు. ఈ కేసుపై సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.

రేణు హత్య ఈ నెల 10న జరిగిందని అవినాశ్ అన్నారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్‌లో రోషన్, హర్ష అనే నిందితులు హత్య చేశారని చెప్పారు. హర్ష కొన్ని రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరాడని, రోషన్ అదే అపార్ట్మెంట్‌లో పై అంతస్తులో పని చేస్తాడని అన్నారు. (Kukatpally Renu Case)

ఇద్దరు నిందితులు రాంచీకి చెందిన వారని, 2023లో రోషన్‌పై మూడు కేసులు నమోదు అయ్యాయని అవినాశ్ తెలిపారు. రేణు అగర్వాల్ ఇంట్లో బంగారం, డబ్బులు ఉన్నాయని నిందితులు తెలుసుకున్నారని అన్నారు. రేణు కుమారుడు, భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే పదో తేదీన నిందితులు కుక్కర్‌తో ఆమె తలపై మోదారని చెప్పారు.

ఆ తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయారని అవినాశ్ అన్నారు. 7 తులాల బంగారు ఆభరణాలు, 10 వాచ్‌లు చోరీ చేశారని తెలిపారు. 8వ తేదీ నుంచి దోపిడీకి ప్లాన్ చేసుకున్నారని చెప్పారు.

Also Read: నెల్లూరులో దారుణం.. మాట్లాడాలని రూమ్‌కు పిలిచి యువతిని హత్యచేసిన నిందితుడు.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

వెంటనే టీమ్‌లను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టామని అవినాశ్ అన్నారు. ఇద్దరు నిందితులు పరిచయస్తులని, నిన్న వారు రాంచీ వద్ద పట్టుబడ్డారని అన్నారు. హర్ష మత్తు పదార్థాలు సేవిస్తాడని చెప్పారు. గతంలో కోల్‌కతా రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకున్నాడని తెలిపారు.

ఈ కేసులో రోషన్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, దోచుకున్న ఆభరణాలను దాచడానికి అతను సహాయపడ్డాడని అవినాశ్ అన్నారు. నిందితులు ఇద్దరు హత్య అనంతరం హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.

నిందితులు హఫీజ్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు ఎంఎంటీఎస్‌ టికెట్లు తీసుకున్నారని అవినాశ్ తెలిపారు. స్టేషన్‌లో పోలీసులను చూసి హఫీజ్ పేట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారని అన్నారు.

అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా రాంచీ చేరుకున్నారని అవినాశ్ అన్నారు. టీవీలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవర్ ఇన్‌పుట్‌ ఇచ్చాడని చెప్పారు. కన్ఫర్మేషన్ అనంతరం రాంచీ వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.