×
Ad

TG LT Recruitment: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి.. షరతులు వర్తిస్తాయ్..

TG LT Recruitment : తెలంగాణ మెడికల్ అండర్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాలు విడుదలయ్యాయి.

TG LT Recruitment Exam Results

TG LT Recruitment: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో హెల్త్ సెక్రటరీ డా.క్రిస్టినా, మెడికల్ బోర్డు అధికారులతో కలిసి విడుదల (TG LT Recruitment) చేశారు.

తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా.. గతేడాది నవంబర్ 10వ తేదీన జరిగిన సీబీటీ పరీక్షకు 23,323 మంది హాజరయ్యారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత తాజాగా బోర్డు 1260 మందితో తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. అయితే, దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన కేసు హైకోర్టులో కొనసాగుతుండటంతో నాలుగు పోస్టులను ఖాళీగా ఉంచగా.. స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న 18 పోస్టులకు సెలక్షన్ జాబితాను వేరుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు ఫైనల్ మెరిట్‌లిస్ట్‌లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా లేదా ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అయితే, ఇక్కడ షరతులు వర్తిస్తాయి. నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి. అభ్యర్థి తప్పుడు సమాచారం సమర్పించినట్లు బోర్డు దృష్టికి వస్తే ఏ దశలోనైనా ఎంపిక రద్దు చేస్తారు. ఇతర పోస్టులకు కోర్టు ఆదేశాల మేరకు పలితాలు విడుదల చేయనున్నారు.