హైదరాబాద్ జూ పార్క్‌లో కలకలం.. ఒక్కసారిగా దాడి చేసిన సింహం

వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు వెటర్నరీ అధికారుల సాయంతో సింహానికి మత్తు ఇంజక్షన్ ఇప్పించారు. అనంతరం సింహాన్ని ఎన్ క్లోజర్ లో వదిలేశారు.

Lion Attack : హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో మరోసారి కలకలం రేగింది. వారం రోజుల వ్యవధిలోనే రెండో దుర్ఘటన జరిగింది. వారం రోజుల క్రితం పాము కాటు ఘటన మరువక ముందే తాజాగా యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసింది. ఈ దాడిలో యానిమల్ కీపర్ చేతులకు గాయాలయ్యాయి. బాధితుడు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎన్ క్లోజర్ శుభ్రం చేసేందుకు వెళ్లిన యానిమల్ కీపర్ హుస్సేన్ పై ఆడ సింహం దాడి చేసింది. 8ఏళ్ల ఆడ సింహం ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లిన హుస్సేన్.. ముందుగా దాన్ని పక్క ఎన్ క్లోజర్ లోకి పంపించాడు. అయితే, ఎన్ క్లోజర్ గడియ పెట్టడం మర్చిపోయాడు.

హుస్సేన్ ఎన్ క్లోజర్ క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన సింహం.. అతడిపై పంజా విసిరింది. దీంతో దూరంగా పడిపోయిన హుస్సేన్.. భయంతో ఎన్ క్లోజర్ గేటు బోల్ట్ పెట్టకుండానే బయటకు పరుగులు తీశాడు. దీంతో ఆ సింహం ఎన్ క్లోజర్ బయటకు వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు వెటర్నరీ అధికారుల సాయంతో సింహానికి మత్తు ఇంజక్షన్ ఇప్పించారు. అనంతరం సింహాన్ని ఎన్ క్లోజర్ లో వదిలేశారు.

హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు దుర్ఘటనలు సందర్శకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జూకి రావాలంటేనే సందర్శకులు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని రోజుల క్రితం పాము కాటు వేసిన ఘటన జరిగింది. తాజాగా యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసింది. ఈ రెండు ఘటనలతో సందర్శకులు హడలిపోయారు. అయితే, ఎవరూ భయపడాల్సిన పని లేదని, మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని జూ పార్క్ అధికారులు స్పష్టం చేశారు.

Also Read : మాజీ ఎమ్మెల్యేని మోసం చేసిన కేటుగాళ్లు, అలా నమ్మించి 48లక్షలు కొట్టేశారు..