Liquor Shops: మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచి మూడ్రోజులు వైన్ షాపులు బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మూడు రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి.

Liquor Shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మూడు రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు వైన్స్ షాపులు, మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బుధవారం సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా 25వ తేదీన కూడా మద్యం దుకాణాలు క్లోజ్ కానున్నాయి.

 

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 23వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. బుధవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ కారణంగా.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని వైన్స్ షాపులు సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతోపాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు.

 

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పోటీపడుతున్నాయి. బీజేపీ తరపున గౌతంరావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీకి అధికార కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది. బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. ఈనెల 23న జరగనున్న ఎన్నికలకు 112 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 81 మంది కార్పొరేటర్లు కాగా.. 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో తొమ్మిది మంది ఎంపీలు, 15మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.