×
Ad

Local Body Election : స్థానిక సమరం.. రెండు రోజుల్లో షెడ్యూల్..? దసరా తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌..

Local Body Election : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ ..

CM Revanth Reddy

Local Body Election : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈనెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు తెలిసింది.

Also Read: Gold Rate Today : పండుగ వేళ గోల్డ్ ప్రియులకు భారీ శుభవార్త.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. వరుసగా రెండోరోజు పడిపోయిన రేటు..

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 26వ తేదీ రాత్రి జిల్లా కలెక్టర్లకు జీవోను పంపనున్నట్లు సమాచారం. ఆ వెంటనే 27వ తేదీన పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్‌లు ఏర్పాటు చేసి.. రిజర్వేషన్లను పబ్లిష్ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ను ప్రచురించి ఈనెల 28వ తేదీ కల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నట్లు సమాచారం. ఆ మరుసటి రోజు 29వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియను ఒకసారి మొదలు పెట్టిన తరువాత కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చునన్న భావనలో అధికారులు ఉన్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపిన బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల కోసం జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు రెండుమూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకావం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ అధికారుల (పీవో)ను నియమించాలని అన్ని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖలు రాశారు. నియమించిన పీవోలకు రెండు రోజుల పాటు జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల 26, 27తేదీల్లో డివిజన్ల వారీగా శిక్షణ ఏర్పాట్లు చేశారు.