Telangana Income1
Telangana Income: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలనే కాదు ఆర్ధిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై పడింది. గత నెలలో లాక్ డౌన్ నుంచి 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వడంతో తెలంగాణ ఆదాయం భారీగా తగ్గింది. మే నెలలో తెలంగాణ ఆదాయం రూ.3000 కోట్లు తగ్గింది. లాక్ డౌన్ కారణంగా పన్నులు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో రాష్ట్రానికి రావలసిన ఆదాయం కూడా తగ్గింది.
లాక్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో రోజుకు రూ. 30 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఇక రవాణా ద్వారా వచ్చే రూ.20 కోట్లు కూడా రాలేదు. సాధారణ రోజుల్లో ఇతర రంగాల నుంచి రూ. 70 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్ డౌన్ కారణంగా సాధారణ రంగాల నుంచి వచ్చే ఆదాయం 60 శాతానికి పైగా తగ్గింది. ఇక లాక్ డౌన్ విదిస్తే వచ్చే నష్టాన్ని అధికారులు ముందుగానే అంచనా వేశారు. రోజుకు రూ. 150 కోట్ల వరకు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. అయితే మే నెలలో ప్రతి రోజు రూ.100 కోట్ల వరకు ఆదాయం తగ్గింది.
ఆదాయం తగ్గినా ప్రజా సంక్షేమ పథకాల్లో మాత్రం ఆటంకం కలగలేదని ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వినోద్ తెలిపారు. ఇదిలా ఉంటే కరోనా కేసులు తగ్గుతుండటంతో లాక్ డౌన్ సడలించే అవకాశం ఉనట్లుగా తెలుస్తుంది. లాక్ డౌన్ సడలిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మంగళవారం జరగనున్న తెలంగాణ కేబినేట్ భేటీ తర్వాత లాక్ డౌన్ సడలింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.