మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సంతాపం.. మహాప్రస్థానంలో మధ్యాహ్నం అంత్యక్రియలు

మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

Maganti Gopinath passed away: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గోపీనాథ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం

సీఎం చంద్రబాబు సంతాపం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన గోపీనాథ్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. గోపీనాథ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.

నారా లోకేశ్ దిగ్భ్రాంతి..
హైదరాబాద్ జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్ర్భాంతికి గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందటం బాధాకరం. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందని, 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని లోకేశ్ గుర్తు చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం గోపీనాథ్ కృషి చేశారని అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని లోకేశ్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ సంతాపం..
మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘గోపీనాథ్ మరణవార్త తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కొద్దిరోజుల కిందట తీవ్ర అస్వస్థతకులోనై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసింది. కోలుకుంటారని భావించాను. 2014 నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ నియోజకవర్గం అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.

మధ్యాహ్నం అంత్యక్రియలు..
మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం నిర్వహించడం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈరోజే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం 4.30 గంటల తరువాత రాహు కాలం వస్తోందని, ఈ కారణంగా.. మధ్యాహ్నం 3 నుంచి 4గంటల మధ్యలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. అంతిమ సంస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారని, వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.