20 ఏళ్లకే రాజకీయాల్లోకి.. 22 ఏళ్లకే కీలక పదవి.. ఎన్టీఆర్ తో అనుబంధం.. మాగంటి గోపీనాథ్ జీవన ప్రయాణం..

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఈనెల 5వ తేదీన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గోపీనాథ్ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ వెంట కొనసాగారు. ఎన్టీఆర్ తో మాగంటికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టీడీపీలో ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో మాగంటి గోపీనాథ్ అనేక కీలక పదవులు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాగంటికి రాజకీయంగా అదే స్థాయిలో గౌరవం దక్కింది.


గతేడాది ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ పాల్గొని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘‘1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి నేను ఆయన వెంటే ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో 20ఏళ్ల వయస్సులోనే రాజకీయాల్లో రావడం జరిగిందని, 22ఏళ్ల వయస్సులోనే 1985లో తెలుగు యువత హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎన్టీఆర్ తనను నియమించారని మాగంటి తెలిపారు. ఎన్టీఆర్ స్వయంగా తనకు నియామక పత్రాన్ని అందజేశారని అన్నారు. ఆ సమయంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారని అన్నారు. 1987లో హుడా డైరెక్టర్ గా, 1988లో హైదరాబాద్ కన్జ్యూమర్ డిస్ట్రిక్ట్ మెంబర్ గా నియమించడం జరిగిందని, తక్కువ వయస్సులోనే ఎన్టీఆర్ తనకు అనేక కీలక పదవులు ఇచ్చారని మాగంటి ఆ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.’’

 

తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాగంటి గోపీనాథ్.. తెలుగుదేశం పార్టీలోనూ, బీఆర్ఎస్ పార్టీలోనూ కీలక పదవులు చేపట్టారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో మాగంటి గోపీనాథ్ పనిచేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల మెజారిటీతో మాగంటి విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. 2018 శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా పని చేసిన మాగంటి.. 2022 జనవరి 26న బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకిదిగి విజయం సాధించారు. వరుసగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.