Varuna Yagam : మహా వరుణయాగంలో ‘కరీరీ ఇష్టి’ అంటే ఏమిటో తెలుసా? యాగంలో ఉపయోగించే మూలికలు ఇవే..
Varuna Yagam : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో మహా వరుణ యాగం నిర్వహించనున్నారు.
- Harish Thanniru
- Updated on- August 8, 2026 / 08:43 AM IST
Varuna Yagam
Varuna Yagam : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో మహా వరుణ యాగం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు ఆగస్టు 10వ తేదీన ఈ యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం వైభవంగా నిర్వహించేందు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. 108మంది బుత్వికులు, 11 హోమకుండాలు, వేద పండితులు, అర్చకులు ఈ యాగ క్రతవును నిర్వహిస్తారు.
Also Read : Konidela Niharika : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మెగా డాటర్ కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్
మన ఇతిహాసాల ప్రకారం.. కరువు వచ్చినప్పుడల్లా రాజులు, మహర్షులు వరుణ యాగాలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. యాగంలో భాగంగా 108మంది రుత్వికులు ఏకధాటిగా చేసే వేదమంత్రాలు, ‘కరీరీ ఇష్టి’ వంటి శక్తివంతమైన వైదిక సూక్తాలను జపించడం ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం మేరకు.. కరీరీ ఇష్టి అంటే వర్షాన్ని రప్పించే అద్భుత క్రతువు. కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణీ సంహిత ఆధారంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వర్షాల కోసం చేసే అత్యంత శక్తివంతమైన వైదిక యాగమే ఈ ‘కరీరీ ఇష్టి’ అంటారు.
‘కరీర’ అనే ఒక ప్రత్యేకమైన అడవి పొద పండ్లను ఎండబెట్టి, వాటిని హోమ గుండంలో ప్రత్యేక మంత్రాలతో ఆహుతి ఇస్తారు. దీనివల్ల వాతావరణంలో తక్కువ పీడనం ఏర్పడి.. మేఘాలు త్వరగా వర్షిస్తాయని నమ్మకం. వరుణ యాగం క్రతువులో ఉపయోగించే ప్రతి వస్తువు నలుపు రంగులో (కృష్ణ వర్ణం) ఉంటుంది. రుత్వికులు ధరించే వస్త్రాలు, హోమ ద్రవ్యాలు, చివరికి అగ్నికి సమర్పించే వెదురు, బియ్యంతో చేసిన అన్నం కూడా నల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలను ఆకర్షించడానికి ఇవి దోహదపడతాయని భావిస్తారు.
వేదాల ప్రకారం.. వర్షాన్ని ఇచ్చే మేఘ రూప దేవతను పర్జన్యుడు అంటారు. పర్జన్య సూక్తం పఠిస్తూ హోమం చేయడం ద్వారా ఆకాశంలో మేఘ గర్జనలు మొదలై, పిడుగుల వంటి నష్టం కలగకుండా శాంతమైన, మేలు చేసే వర్షాలు కురుస్తాయి. ఈ రెండు విశిష్ఠ ప్రక్రియల ద్వారా గాలిలోని తేమ శాతం పెరిగి, స్థానిక వాతావరణం చల్లబడి, ఆ పరిసర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆశిస్తారు.
వరుణ యాగంలో.. వరుణ వృక్షం ఎండిన కొమ్మలు, బెరడును హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు. నల్ల నువ్వులను ఉపయోగిస్తారు. వట్టివేరును ఆహుతిగా ఇస్తారు. యాగశాలలో 11 హోమకుండాల్లో ప్రత్యేకమైన నవగ్రహ, యాగ సమిధలను ఉపయోగిస్తారు. అందులో మర్రి, జువ్వి, రావి, మేడి, ఉత్తరేణి, జమ్మి తదితర పంచక్షీర వృక్షాలు, నవధాన్యాలు, ఆవు నెయ్యి ఉపయోగిస్తారు.
