Formula E Race Case : గత ప్రభుత్వం హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మంగళవారం ఏసీబీకి సీఎస్ లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్ కు క్యాబినెట్ ఆదేశించింది. ఈ-రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫార్ములా రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించేందుకు రాష్ట్ర సర్కార్.. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను అనుమతి కోరుతూ లేఖ రాయగా.. గవర్నర్ దానికి ఆమోదం తెలిపారు.
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.50 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి అనుమతి కోరింది రేవంత్ సర్కార్. కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేశారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పై ఏసీబీ తన దర్యాఫ్తును కొనసాగించవచ్చు. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పుడు హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
గవర్నర్ అనుమతిపై క్యాబినెట్ లో చర్చ జరిగిందని, ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ పై తానేమీ చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేస్తుందన్నారు. గతంలో తాము చేసిన బాంబు వ్యాఖ్యలు తుస్సుమన్నాయని ఇటీవల బీఆర్ఎస్ నేతలు అన్నారని, మరి తుస్సుమనేది అయితే… ఢిల్లీ చుట్టూ ఎందుకు ప్రదక్షణ చేశారని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.
తాము ఎప్పుడో గవర్నర్ అనుమతి కోరితే ఇప్పుడు ఇచ్చారని చెప్పారు. ఫార్ములా కేసులో విదేశాలకు డబ్బులు వెళ్లాయని, ఆర్బీఐ అనుమతి తీసుకోలేదన్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో విచారణలో తేలుతుందన్నారు. ఈ కార్ కేసులో డబ్బుల బదిలీ పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు.
మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
* ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చారు
* ఏసీబీ విచారణ మొదలవుతుంది, డొంక కదులుతుంది
* చట్టం తన పని తాను చేస్తుంది
* ఫార్ములా ఈ కార్ రేసులో కోట్లలో దోపిడీ జరిగింది
* ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో విదేశాలకు డబ్బులు వెళ్లాయి
* డబ్బులు ఎలా వెళ్లాయన్నది విచారణలో తేలుతుంది
* ఫార్ములా ఈ కార్ రేసులో డబ్బుల బదిలీ మ్యాచ్ ఫిక్సింగ్
* తుస్సు బాంబులే అయితే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత భయం
* అర్థరాత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఎందుకు వేడుకున్నారు?
* 2023 ఫిబ్రవరి 11న మొదటి ఫార్ములా ఈ కార్ల రేస్
* రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా ప్రభుత్వ మార్పు
* ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్ల చెల్లింపులు
* నిధుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని గుర్తింపు
Also Read : లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. రెండు నెలలు అక్కడే ఉండేందుకు ప్లాన్