Malakpet Assembly Constituency Ground Report
Malakpet Assembly Constituency: రాజకీయ సంచలనాలకు కేంద్రం మలక్‌పేట్. హైదరాబాద్ నగరంలో హాట్‌సీట్లలో మలక్‌పేట ఒకటి. ఇక్కడి నుంచి ఎందరో ఉద్దండులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు.. ఆ తర్వాత బీజేపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గం ఇప్పుడు MIM అడ్డాగా మారిపోయింది. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో 2009 నుంచి ఎంఐఎం హవాయే నడుస్తోంది. అయితే ఈ సారీ ఎన్నికలు అంత ఈజీగా కనిపించడం లేదు. ఎంఐఎం పార్టీకి దీటుగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా (Ahmed Balala)కు సీటుకు ఎర్త్ పెట్టేలా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఈ సారి పొత్తు లేకపోతే మలక్‌పేట రాజకీయం మొత్తం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తాజా రాజకీయ పరిణామాల ప్రభావం మలక్‌పేట్‌పై ఎలా చూపుతుంది? మలక్‌పేట్‌లో ఈసారి గెలిచి నిలిచే నాయకులెవరో? ఇప్పుడు చూద్దాం.
మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ఘన చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాల కేంద్రంగా ఉండేది ఈ నియోజకవర్గం. సరోజిని పుల్లారెడ్డి(Sarojini Pulla Reddy), కందాల ప్రభాకర్ రెడ్డి, నల్లు ఇంద్రసేనా రెడ్డి(Nallu Indrasena Reddy) వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం మలక్‌పేట. 1967లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గెలిచిన సరోజిని పుల్లారెడ్డి ఆ తర్వాత కాలంలో మలక్‌పేట్ ఎమ్మెల్యేగా గెలిచి నలుగురు ముఖ్యమంత్రుల హాయాంలో మంత్రిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో కీలక మంత్రిగా పనిచేశారు సరోజని పుల్లారెడ్డి. 1978లో సరోజిని పుల్లారెడ్డిపై జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచిన కందాల ప్రభాకర్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ లో చేరి రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడి నుంచి… BJP తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన నల్లు ఇంద్రసేనా రెడ్డి అనేక రికార్డ్లను బ్రేక్ చేశారు.
అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా (photo: facebook)
మొదటిసారి 1983లో అప్పటి హోంమంత్రి ప్రభాకర్ రెడ్డిని ఓడించిన ఇంద్రసేనారెడ్డి.. రెండోసారి మాజీ CM నాదెండ్ల భాస్కర్రావును ఓడించారు. ఇంద్రసేనారెడ్డి ఇక్కడి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆయన తర్వాత మల్‌రెడ్డి రంగారెడ్డి ఒకసారి టీడీపీ తరఫున, రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం MIM ఖాతాలో చేరింది. వరుసగా మూడు ఎన్నికల్లోనూ MIM పాగా వేసింది. MIM నేత అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఓటమి ఎరగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో మరోసాని ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు బలాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనకు పోటీగా బీజీపీ, కాంగ్రెస్ కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మలక్‌పేట్ నియోజవర్గం హైదరాబాద్ నగరంతోపాటు.. పక్కనున్న రూరల్ ప్రాంతంలో విస్తరించి ఉండేది. ఆజంపురా, అక్బర్ బాగ్, చాదర్ ఘాట్, ఓల్డ్ మలక్ పేట్, ముసరాంభాగ్, సైదాబాద్, చంచల్ గుడా డివిజన్ లతోపాటు… బాట సింగారం, హయత్ నగర్, సరూర్ నగర్, జల్ పల్లి, పహాడి షరిఫ్లో కొంత ప్రాంతం, రాగన్నగూడ, నాదర్ గుల్ ప్రాంతాల్లో ఓటర్లు ఉండేవారు. నగరంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నా.. రూరల్ ప్రాంతంలో ఉన్న ఓట్లతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ ఉండేవారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన MIMకి బాగా కలిసి వచ్చింది. 2009 తర్వాత గ్రామీణ ప్రాంతాలు అన్నీ మలక్‌పేట నుంచి వేరుపడ్డాయి. పూర్తిగా నగరం పరిధిలో ఉన్న మైనార్టీ ప్రాంతమే ఎక్కువగా ఈ నియోజవర్గంలో కలిసింది.
మహ్మద్ ముసఫర్ అలీఖాన్ (photo: facebook)
రూరల్ ప్రాంతాలు LB నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం అసెంబ్లీ పరిధిలోకి వెళ్ళాయి. ప్రస్తుతం 2 లక్షల 61 వేల 705 ఓట్లు ఉన్నాయి. సైదాబాద్, ముసరాం భాగ్, అక్బర్ బాగ్‌ల్లో హిందు ఓటు బ్యాంక్ ఉన్నప్పటికి మిగతా డివిజన్ల్లో 90 శాతం ఓట్లు ముస్లిం మైనారిటీలు కావడంతో ఇక్కడ MIM గెలుపు నల్లేరుపై నడకగా మారింది. చంచల్గూడలో 49 వేల ఓట్ల ఉంటే అక్కడ కేవలం 830 ఓట్లు మాత్రమే హిందూ ఓట్లు. మైనారిటీలు ఎక్కువగా ఉండటంతో MIMకి పోటీగా ఇతర పక్షాలు మైనారిటీ నాయకులనే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. బీజేపీ తరపున సిట్టింగ్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీంద్రారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: రాజాసింగ్ ఇలాఖాలో తడాఖా చూపేదెవరో.. గోషామహల్‌లో గులాబీ జెండా ఎగిరేనా?
ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్ బలాలా తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీలో బలాలాకు వ్యతిరేకంగా ఎలాంటి గ్రూపుల బెడద లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా ఎమ్మెల్యేకు అనుకూలమైన అంశంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా బలాలా వద్దని పార్టీ అధినేత ఒవైసీ భావిస్తేనే ఇక్కడ అభ్యర్థి మార్పు జరగొచ్చు. పార్టీ కార్యకర్తలతోపాటు నియోజకవర్గ ప్రజలతో మంచి రిలేషన్స్ ఉండటంతో ఈసారి కూడా బలాలనే ఇక్కడి నుండి బరిలో ఉంటారని ఎంఐఎం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆలే జితేంద్ర (photo: facebook)
ఎంఐఎంను ఢీకొట్టాలని ఈ సారి కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. గతంలో గెలిచిన అసెంబ్లీ కావడంతో ఆ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో ఇక్కడి నుంచి TDP అభ్యర్థిగా.. మహ్మద్ ముసఫర్ అలీఖాన్ పోటీచేసి 30 వేల ఓట్లు దక్కించుకున్నారు. BJP నుంచి టైగర్ నరేంద్ర కుమారుడు ఆలే జితేంద్ర (Ale Jeetendra) పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి హిందు ఓటు బ్యాంక్ చీలకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఎంఐఎంపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓట్ల చీలిపోయి సిట్టింగ్ ఎమ్మెల్యేకు కలిసొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?
ఇక BRSకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఆ పార్టీకి కటీఫ్ చెప్పి వచ్చే ఎన్నికల్లో సొంతంగా 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే మలక్ పేట్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ఉండే అవకాశం ఉంది. మైనార్టీ ఓట్లను బీఆర్ఎస్ చీల్చే చాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఎంఐఎం ఆధిపత్యం తగ్గటం ఖాయం. ఈ ఈక్వేషన్స్ అన్నీ పరిశీలిస్తే.. MIM, BRS మధ్య పొత్తు లేకపోతే ఎన్నిక రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. BRS పోటీలో ఉన్నా లేకపోయినా మలక్‌పేటలో రాజకీయం మొత్తం మూడు పార్టీల మధ్యే నడుస్తోంది. ఎంఐఎం జోరుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్.. బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. చివరికి ఓటరు దేవుడు ఎవరి ఆదరిస్తారో చూడాల్సిందే.